సిద్దిపేట అర్బన్, జనవరి 9 : రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో బోరు బావుల్లో సరైన నీరు లేక ఆరుతడి పంటలతోపాటు వరిపొలాలు పారడం లేదన్నారు. రంగనాయకసాగర్ నుంచి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. నీటిని విడుదల చేయకపోతే సాగు నీరు లేకపోవడంతో పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, రైతులు పాల్గొన్నారు.