మెదక్ : సింగూర్ ప్రాజెక్ట్ ( Singur Project ) నుంచి ఘనపూర్ ( Ghanapur ) ఆయకట్టు పంటను కాపాడేందుకు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ( Padma Devender Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో పంటపొలాలను పార్టీ మండల నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ప్రతి సంవత్సరం రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి రెండు పంటలు పండించే అవకాశం కల్పించారని తెలిపారు. ఘనపూర్ ఆయకట్ట పరిధిలో ఎఫ్ఎం, ఎఫ్ఎన్ కాలువల ద్వారా మూడు మండలాలకు సాగునీరు అందుతూ రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేవారని చెప్పారు.
పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ సీజన్లో సింగూర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు.
రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. పంటలు పొట్టదశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు
ఆమె వెంట చిట్రియల్ సర్పంచ్ సురేష్, పాపన్నపేట్ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాల గౌడ్, మాజీ రైతుబంధు అధ్యక్షులు సోములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు కొత్తపల్లి జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, బద్రి, మల్లేశం శ్రీనాథ్ రావు, నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.