గుమ్మడిదల, ఫిబ్రవరి 23 : డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసి తమ ప్రాంతాన్ని కాలుష్యకారకంగా మార్చి బతుకులు నాశనం చేయవద్దని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లవల్లిలో ఆదివారం 19వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. యువకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. తమ కుటుంబాలు ఎవుసాన్ని నమ్ముకుని బతుకుతున్నాయని, డంపింగ్‌యార్డు ఏర్పాటుతో కాలుష్యంతో తమ బతుకులు ఆగమవుతాయని, ఎవుసం కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మడిదలలో 13వ రోజు రిలే నిరాహార దీక్షలో కొనసాగింది.
మల్లికార్జునయాదవ సంఘం, మహిళా జేఏసీ, రైతు జేఏసీ నాయకులు, యువకులు దీక్షలో కూర్చున్నారు. మల్లికార్జున యాదవ సంఘం రూ.5 వేల విరాళం అందజేశారు. అంతకు ముందు గుమ్మడిదలలో జాతీయరహదారిపై మహిళలు, రైతులు, చిన్నారులు మొక్కలు చేతపబట్టుకుని సేవ్ ఫారెస్ట్, సేవ్ ఫార్మర్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చిన్నారుల సైతం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ సర్కారుకు మనసు కరగడం లేదా అని వారు ప్రశ్నించారు.
ఈ డంపింగ్‌యార్డు కేవలం ఒక గుమ్మడిదల, నల్లవల్లి గ్రామాల సమస్య కాదని, దీనివల్ల నర్సాపూర్, శివంపేట వంటి మండలాలకు ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఆందోళనల్లో మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కాలకంటి రవీందర్‌రెడ్డి, పోచుగారి మోహన్‌రెడ్డి, నల్తురుయాదగిరి, నర్సింలు, స్వేచ్చారెడ్డి, మల్లికార్జున సేవ సంఘం సభ్యులు, యాదవసంఘం సభ్యులు, ఫయాజ్షరీఫ్, కుమ్మరి ఆంజనేయులు, చాపలమధు, రామకృష్ణ, సురేశ్, రైతులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.