మునిపల్లి, ఫిబ్రవరి 28: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసుకునేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకందారులు, కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసే కంప్యూటర్ ఆపరేటర్ సెలవులో ఉంటే చాలు ఆ రోజు రిజిస్ట్రేషన్లు లేనట్లే. మరో వ్యక్తిని ఏర్పాటు చేయకుండా అధికారులు ఇటు రైతులను, అటు కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సోమవారం నుంచి మండలంలో ఒక్క రిజిస్ట్రేషన్ చేయలేదు. తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగకపోయినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లిలో శనివారమైనా రిజిస్ట్రేషన్లు ఉంటాయా, ఉండవా అని ఎదురుచూస్తున్నారు. నిత్యం స్లాట్స్ బుక్ చేస్తున్నారు. టేట్స్ మారుస్తున్నారు తప్ప రిజిస్ట్రేషన్లు మాత్రం జరగటం లేదు. మునిపల్లి ఉప తహసీల్దార్ కృపానందంను వివరణ కోరగా ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీలో భాగంగా గురువారం వరకు రిజిస్ట్రేషన్లు చేయలేకపోయాం, శనివారం కంప్యూటర్ ఆపరేటర్ వస్తాడా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని క్రయవిక్రయదారులు కోరుతున్నారు.