మెదక్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హకు ఎంతో విలువైనదని, ఓటుతో దేశాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు నూతన ఓటరుగా ఫామ్ 6 ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కొత్త ఓటర్ల వివరాల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లను ఆదేశించారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేలా యువతకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కోరారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం బూత్ లెవల్ అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాల వారీగా ఫామ్ 6 ఆన్లైన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, బీఎల్వో, బీఎల్వోల సూపర్ వైజర్ల ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు నమోదుపై విసృ్తత ప్రచారం చేపట్టాలన్నారు.