అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లే రోగులకు చేదు అనుభవం ఎదురవుతోంది. కొన్ని నెలలుగా అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని ప్రైవేట్‌కు పంపిస్తూ వైద్యులు, సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కేసీఆర్ ప్రభుత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన దవాఖానలో అన్ని రకాల వైద్యసేవలు అందక రోగులు నానా అవస్థలు పడుతున్నారు.
గజ్వేల్, జూలై 22: సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లా దవాఖానలో వైద్య సేవలు, ల్యాబ్ పరీక్షలు పూర్తి స్థాయిలో అందక రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానల్లో లక్షల వరకు బిల్లులు విధించడంతో సామాన్య కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ దవాఖానలో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రైవేట్‌లో చేయించుకోవాలని చెప్పి పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని దిలాల్పూర్ గ్రామానికి చెంది న అమ్మాయిని అత్యవసర చికిత్స కోసం గజ్వేల్‌లోని జిల్లా దవాఖానకు తీసుకువెళ్లారు. పరీక్షించిన అనంతరం సిబ్బంది ప్రజ్ఞాఫూర్లోని ప్రైవేట్ దవాఖానకు వెళ్లాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో చికిత్స కోసం వెళ్తే అక్కడ లక్షల్లో బిల్లులు వేయడంలో అప్పులపాలై రోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. గజ్వేల్, ప్రజ్ఞాఫూర్లోని కొన్ని ప్రైవేట్ దవాఖానలు ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులపైనే ఆధారపడి నడిపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జిల్లా దవాఖా న, మాతా శిశు దవాఖానల్లో ప్రస్తుతం 40 మంది వైద్యులు, 55 మంది హెడ్, స్టాఫ్ నర్సులతో పాటు మరికొంత మంది ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన నుంచి 11 మంది వైద్యులు, 13 మంది స్టాఫ్ నర్సులు ఇతర ప్రాంతాలకు బదిలీ కాగా, ముగ్గురు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులను మాత్రమే భర్తీ చేశారు.
ఎక్కువ సంఖ్యలో బదిలీ కావడంతో ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలపై ప్రభావం పడింది. బదిలీల్లో వెళ్లిన వైద్యుల స్థానంలో పూర్తిస్థాయిలో తిరిగి కొత్తవారిని భర్తీ చేయకపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ దవాఖానలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని, అవసరం లేకుం డా ప్రైవేట్‌కు పంపించడం తగదని రోగుల బంధువులు కోరుతున్నారు.