దుబ్బాక, మే 18: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రెండెకరాల స్థలంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నది. దుబ్బాక పట్టణంలో మొక్కలు నాటేందుకు ఈ నర్సరీలో పలు రకాల మొక్కల పెంపకం చేపట్టారు. విడతల వారీగా నర్సరీ నిర్వహణకు మున్సిపల్ నుంచి రూ.30 లక్షలు వెచ్చించి మొక్కలు పెంపకం చేపట్టారు.
నర్సరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నర్సరీలో మొక్కల సంరక్షణతో పాటు వాటికి నీరందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. కొంతకాలంగా నర్సరీలో మొక్కలకు సరైన నీరందించక పోవడంతో మొక్కలు ఎండిపోయి నిర్జీవంగా మారాయి. దుబ్బాక పట్టణంలో నర్సరీ నిర్వహణలో మున్సిపల్‌కు ఇబ్బందులు తలెత్తడంతో ఇటీవల వాటి నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు.
వన మహోత్సవానికి సుమారు 50 వేలకుపైగా మొక్కలు అవసరం ఉండగా, తగినన్ని మొక్కల పెంపకం చేపట్టడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. వన మహోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అధికార యంత్రాంగం సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మహిళా సంఘాలకు అప్పగించాం..
దుబ్బాక పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోయాయి. ఇప్పుడు నర్సరీ నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాం. దుబ్బాక మున్సిపల్ పరిధిలో 4 నర్సరీలు మహిళా సంఘాలకు అప్పగించాం. చెల్లాపూర్‌లో -2, ధర్మాజీపేట, మల్లాయిపల్లి, చేర్వాపూర్ వార్డులలో ఒక్కోటి చొప్పున మొత్తం 5 నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఇందులో 25 వేల మొక్కలు పెంచనున్నారు. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కల పెంపకం కొనసాగుతుంది. ఒక్కో మొక్కకు రూ.10 చొప్పున వారికి చెల్లిస్తాం. మొక్కల పెంపకం ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతుంది. – శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్ కమిసనర్