మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్10: ప్రజాకవి,తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, వాగ్గేయకారుడు అందెశ్రీ సోమవారం మృతిచెందడంతో ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి చిన్నబోయింది. అందెశ్రీ మృతి తెలియగానే బంధువులు, స్నేహితులు విలపించారు. అతనితో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందెశ్రీ సొంతంగా నిర్మించుకున్న ఇంటి వద్దకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.
అందెశ్రీ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తే బావుంటందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. తాను మృతి చెందిందే తన శవాన్ని ఈ మట్టిలోనే కలపాలని అందెశ్రీ గతంలో తన మిత్రుల వద్ద చెప్పేవాడని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ మృతికి సంతాపంగా గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు. అందెశ్రీని కడసారి చూసేందుకు గ్రామస్తులు, బంధువులు, కుటుంబీకులు హైదరాబాద్కు తరలివెళ్లారు. గ్రామంలోని పాఠశాలను అందెశ్రీ పలుసార్లు సందర్శించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
అందెశ్రీ ఇటీవల పాఠశాలను సందర్శించి, పాఠశాల అభివృద్ధికి రూ. 2కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. స్వతహాగా తాపీమేస్త్రీ అయిన అందెశ్రీ స్వయంగా గ్రామంలో ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఇతనికి గతంలో ప్రభుత్వం 500 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. అందెశ్రీ ఇటీవల గ్రామంలో 3.30 ఎకరాల భూమిని కొన్నారు. ఆ భూమిలో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు అతని మిత్రులు తెలిపారు.
పాలేర్లుగా పనిచేసినం..
అందెశ్రీ నేను బాల్యమిత్రులం. అందెశ్రీ జక్కిరెడ్డి మల్లారెడ్డి వద్ద, నేను ఇక్కిరెడ్డి మల్లారెడ్డి వద్ద పశువుల పాలేర్లుగా పనిచేశాం. అందెశ్రీ ఊర్లకొచ్చిండు అంటే నా ఇంటికొచ్చేది. అందెశ్రీ ఏ విషయమైనా నాతో పంచుకునేది. ఇద్దరం ఎప్పుడు కలిసిమెలిసి తిరిగేది. గవర్నమెంట్తో మాట్లాడి ఊరికి నిధులు తీసుకువస్తనని చెప్పిండు. అందెశ్రీ తన పుట్టిన ఊళ్లే జాగా ఉండాలని చెప్పి, మొన్ననే నాలుగు ఎకరాల భూమిని కొన్నడు. కొన్న భూమికి నిన్ననే హద్దులు పాతి ఫోన్ చేస్తే డ్రైవరు ఫోన్ ఎత్తి. సార్ది ఆరోగ్యం బాగాలేదని చెప్పిండు. తెల్లారేవరకు ఈ వార్త విని
షాక్కు గురయ్యాను.
– బొమ్మగాని శివయ్యగౌడ్, బాల్యస్నేహితుడు
అనేక బాధలు అనుభవించిండు..
అందెశ్రీ కుటుంబం మా కుటుంబం అంతా ఒక్కటే. మా కుటుంబం చాలా పెద్దది. అందెశ్రీ చిన్నప్పుడు జీతముండి కష్టపడి ఎదిగాడు. పూజారి మల్లయ్య వద్ద ఆయన, నేను ఇద్దరం కలిసి జీతమున్నం. నలభై ఎండ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిండు. తాపీ పనిచేసుకుంటూ ఘోరమైన బాధలు అనుభవించిండు. ఆ బాధలు ఎట్లభరించిండో యాది చేసుకుంటనే బాధ అయితాంది. అందెశ్రీ చనిపోవడం మాకు బాధగా ఉంది. ఆయన ఉన్నడంటేనే మాకు ధైర్యముండేది. రేబర్తి నుంచి ఇంతస్థాయికి ఎదగడం మాకు ఎంతో గర్వంగా ఉంది.
– అందె పరశురాములు, బంధువు