హుస్నాబాద్, జనవరి 12: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి ఇండస్ట్రియల్ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా హు స్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అన్నారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన భూనిర్వాసితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌటపల్లి, జనగామ, తోటపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో 124ఎకరాల భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.
ఇందు లో పేర్లు రాని వాళ్లు, పేర్లు తప్పుగా పడినా వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలున్నా వెంటనే తెలియజేయాలని కోరారు. భూనిర్వాసితులకు పరిహారం ఎంత అనేది త్వరలోనే నిర్ణయిస్తామని, భూ నిర్వాసితుల సమక్షంలోనే పరిహారం నిర్ణయం జరుగుతుందన్నారు. ప్రభు త్వ ఆదేశాల ప్రకారమే భూసేకరణ చేపట్టిన ట్లు తెలిపారు. ఇందులో పట్టా ఉండి పేర్లు రాకపోయినా, భూమి లేకుండానే పేర్లు వచ్చి నా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కుకు స్థలాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో భూ నిర్వాసితులతో పాటు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వం ఇచ్చిన భూము ల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, భూములు తీసుకొని మాకు అన్యాయం చేయవద్దని కొందరు రైతులు ఆర్డీవోకు విన్నవించారు. ఒక దశలో ఆర్డీవో వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగుతూ తమ ఆవేదన తెలియజేశారు. ఉన్న కొద్దిపాటి భూము లు కూడా పోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయకుండా చూడాలని రైతులు కోరారు. వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములు కాకుండా మరోచోట ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆర్డీవో స్పందిస్తూ రైతుల విన్నపాన్ని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.