చౌటకూర్, సెప్టెంబరు 26: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహల్లో మెస్ నిర్వహణ అధ్వానంగా తయారైంది. రెండు నెలల క్రితం సాంబారులో ఎలుక పడి వివాదాస్పదమైనప్పటికీ మెస్‌ల నిర్వహణ మాత్రం మారడం లేదు. గురువారం అందోలు-జోగిపేట ఆర్డీవో పాండు, చౌటకూర్ తహసీల్దార్ ఈశ్వరీరాణి, ఆర్ఐ నాగరాజు వంట తయారు చేసే సమయంలో బాలికల వసతి గృహన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వంట గది ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం, వంట గది నుంచి మురుగు పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడాన్ని పరిశీలించారు. వంటలకు ఉపయోగించే నూనె, కారం, వెల్లుల్లి, పసుపు, ఇతర మాసాలలు నాణ్యత లేకపోవడాన్ని గమనించారు. పెరుగు ప్యాకెట్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడంతో అవి గడ్డకట్టాయి. వంట పాత్రలు శుభ్రం చేసే గది నుంచి మురుగు బయటకు వెళ్లేందుకు పైప్‌లైన్ సక్రమంగా లేకపోవడం, మ్యాన్హోలు సైతం చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వ్యాపిస్తున్నది.
ఇలాగైతే విద్యార్థులు భోజనం ఎలా చేస్తారంటూ ఆర్డీవో పాండు, తహసీల్దార్ ఈశ్వరీరాణి వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో వంటలు ఇలాగే వండుకుని తింటారా అం టూ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ, వైస్ ప్రిన్సిపాల్ రాఘవేందర్రావు అందుబాటులో లేరు. ఆర్డీవో పాండు ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి వారం రోజుల్లోగా వసతి గృహలను శుభ్రం చేయాలని ఆదేశించారు. వసతి గృహలను శుభ్రంగా ఉంచని సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని, విననిపక్షంలో విధుల నుంచి తొలిగించాలన్నారు.