చిలిపిచెడ్,మే 7 : రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టం అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఫైజాబాద్, అజ్జమర్రి గ్రామల్లో కొనసాగుతున్న భూ సమస్యలపై రైతులు అందజేసిన దరఖాస్తులను ఆర్డీవో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు భూ సమస్యలపై తహసీల్ధార్, ఆర్డీవో కార్యాలయాలకు వెళ్లాల్సివచ్చేదన్నారు.
కానీ, ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకే వచ్చి ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలో ఎవరెవరికి ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయో అవగాహన వస్తుందన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో రైతుల దగ్గర నుంచి పూర్తిగా స్వీకరించబడతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సహదేవ్, ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.