సిద్దిపేట, ఏప్రిల్ 1: సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వేసవి ఎండల తీవ్రతతో పొలాలు ఎండిపోయాయి. రంగనాయక సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలితే పంటలు గట్టెక్కేవని , నీళ్లు వదలాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రంగనాయక సాగర్ ఎడమ కాలువ కింద సిద్దిపేట రూరల్ మండ లం మాచాపూర్‌లో సుమారు 60 వరకు ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. బీఆర్ఎస్ హయాంలో పుషలంగా నీటిని వదిలిన అధికారులు, ఇప్పుడు రంగనాయక సాగర్ నీటిని మాచాపూర్‌కు వదలక పోవడంతో కెనాల్ పకనే ఉన్నా పంట పొలాలు ఎండిపోతున్నాయి. గ్రామంలోని బోయినీ(బతుకమ్మ) చెరువును నింపితే తమ బోరుబావుల్లో పుషలంగా నీరు వచ్చేవని రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలోకి నీటిని వదిలి చెరువును నింపితే కొద్దిపాటి పంటలైనా దకుతాయని రైతులు తెలిపారు.
యాసంగిలో నాలుగెకరాల్లో వరి నాటుపెట్టిన. ఇప్పటికే ఎకరం 20 గుంటల పొలం ఎండింది. పది రోజులు నీళ్లు ఉంటే పొలం మొత్తం పండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువ ద్వారా నీళ్లు మంచిగ ఇచ్చింది. ఈసారి నీళ్లు వదలాలని ఎన్నిసార్లు అధికారులను అడిగినా వదలడం లేదు. 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టి మునిగినం. రంగనాయక సాగర్ ఎడమ కాలువ నీటిని వదిలితే ఉన్న కొద్ది పంటన్నా పండుతది.
– గంద్యడపు శ్రీనివాస్, రైతు, మాచాపూర్ (సిద్దిపేట జిల్లా)
రెండెకరాల్లో వరినాటు పెట్టినం. వరి పొట్టకొచ్చే దశలో ఉంది. ఒక 15 రోజులు నీళ్లు ఉంటే పంట పండేది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయాక పంట ఎండిపోతున్నది. వరుస తడులు పెడుతున్నా నీళ్లు ఏ మూలకు సరిపోతలేవు. నేను డ్రైవర్‌గా పనిచేస్తా. పంట ఎండిపోతుండడంతో వరుస తడులు పెట్టడం కోసం డ్రైవర్ పని బంద్‌చేసి పొలం చుట్టే ఉంటున్న. అయినా పొలం ఎండి పోతూనే ఉన్నది. రోజు ఒక మూల చొప్పున రెండెకరాలు ఎండింది. గతంలో రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు రావడంతో పంటలు మంచిగ పండించుకున్నం. ఈ పసలుకు కాలువల నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండుతున్నయి.
– మేకల సంజీవరెడ్డి, రైతు, మాచాపూర్ (సిద్దిపేట జిల్లా)