రామాయంపేట రూరల్, మే 05 : ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేస్తున్న సన్న, చిన్నకారు రైతులు ఆధునుక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు రాములు నాయక్ సూచించారు. సోమవారం రామాయంపేట మండలం రాయిలాపూర్ రైతు వేదికలో జరిగిన ‘రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు’ అన్నదాతలకు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల అభివృద్ధే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించే బాధ్యత తమపై ఉందన్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో పాటు సన్న, చిన్నకారు రైతులు ఆదాయం పొందే విధంగా రైతులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
వానాకాలానికి ముందస్తుగా ఫ్రొపెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధన పలితాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందించే విధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఇంచార్జి ఏడీఏ రాజ్ నారాయణ, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.