సిద్దిపేట, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోహిణికార్తెలోనే వర్షాలు పడుతున్నాయి.దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయికి డబ్బులు కావాలి, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడానికి చేతిలో పైసలు లేవు. సాగు చేయడానికి చేతిలో పెట్టుబడి లేక వడ్డీప్యాపారుల వద్దకు అప్పులకు రైతులు పరుగెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో రైతులకు రైతు భరోసా వేయడం లేదు. గత యాసంగి, అంతకు ముందు వానకాలం డబ్బులే పూర్తిగా వేయలేదు.
గత యాసంగి డబ్బులు కేవలం రెండున్నర ఎకరాల వరకే వేసి ప్రభు త్వం చేతులు దులుపుకున్నది. ఈ సారి వానకాలంలోనైనా సకాలంలో రైతు భరోసా డబ్బులు వేస్తారా..? అని రైతులు ఆశగా ప్రభుత్వం వైపుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో రైతు బంధు వేయడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు పనులు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు తిప్పలు మొదలయ్యాయి. విత్తనం విత్తుకునేనాటి నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునేదాకా తిప్పలే ఉన్నాయి.
వానకాలం సాగు పనులు షురూ అయ్యాయి. రైతులకు రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వ అన్ని కోతలు పెడుతున్నది.ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తుంది. ఏడాదిన్నర దాటినా ఇంత వరకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి చేయలేదని రేవంత్‌రెడ్డిపై రైతులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఠంచన్‌గా పంట సాగు కాలం ప్రారంభం కాగానే రైతు బంధు డబ్బులు జమ అయ్యేవి. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమం గురించి పూర్తిగా విస్మరించి అన్ని పథకాలకు కోత పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన రైతు బంధును మాత్రమే వేసింది.
వానకాలంలో రైతులకు వేయాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టింది. యాసంగి సాగు పనులు పూర్తి అయి పంట చేతికి వచ్చి ధాన్యం అమ్ముకున్నా ఇంత వరకు రైతు భరోసా దిక్కేలేదు. వానకాలం సాగుకు రైతు భరోసా వస్త్తదా…? రాదా తేలియదు. గత యాసంగిలో కొంత మందికి రైతు భరోసా కింద ఎకరానికి 6 వేల చొప్పున వేస్తామని చెప్పి, మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని తొలి విడతలో ఎకరానికి రూ. 6 వేల చొప్పున గ్రామంలోని రైతులకు వేశారు. ఆ తర్వాత అందరికీ రెండు ఎకరాల వరకు మూడు విడతల్లో రైతు భరోసా విడుదల చేశారు. మిగిలిన ఏ రైతుకు పూర్తి స్థాయిలో రైతు భరోసా పడలేదు.
ఎన్నికల ముందు రైతులకు రెండు లక్షల పంట రుణ మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మొండి చేయి చూపింది. ఇక రైతు భరోసా వస్తదా…? రాదా…? తెలియదు. మే 2018 లో కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించి పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలు ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలు అందించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 11వ విడతల్లో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో కేసీఆర్ ప్రభుత్వం జమ చేసింది.సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 మంది రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకు రూ.3,619.54 కోట్లు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో వేసింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి రైతులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. స్వయంగా రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడింది. ఈ కాంగ్రెస్ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపుతోంది.
వానకాలం వర్షాలు పడుతున్నాయి. కాలం నెత్తిమీదికొ చ్చినా ప్రభుత్వం రైతు భరోసా వేస్తలేదు. బీఆర్ఎస్ ప్రభు త్వంలో యాసంగి, వానకాలం ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడేది. గీ కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో పంటలు పండించి కాంటా పెట్టినా ఇంత వరకు ఆపంటలకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు నేటికీ కొంతమంది రైతులకు ఇంకా అందలేదు. బీఆర్ఎస్ పాలనలో మా వంటి ఎంతో మంది రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
-వెంకటస్వామిగౌడ్, రైతు,నస్కల్, నిజాంపేట మండలం, మెదక్ జిల్లా
గడిచిన పదేండ్లలో రైతులకు ఎలాంటి అవస్థ లేకుండా కేసీఆర్ రైతు బంధు పైసలు వేశాడు. ఆ పైసలతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడంతోపాటు దున్నుకాలు, నాట్లు వేసే కూలీలకు ఇచ్చే వాళ్లం. పంట పెట్టుబడికి రైతుబంధు పైసలు ఠంచన్‌గా రావడంతో ఇబ్బంది లేకుండా ఎవుసం చేసుకునేవాళ్లం. వానకాలం వర్షాలు పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు వేయలేదు. ఎరువులు,విత్తనాలకు అప్పుజేసుడు ఖాయం.కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పంటపెట్టుబడుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
-తిరుమల్, రైతు,నిజాంపేట మండలం, మెదక్ జిల్లా