కోహీర్, సెప్టెంబర్16: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని బూచన్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న 20వ రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు సోమవారం రైల్వే, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రైల్వే గేటును మూసివేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. దీంతో రైలు పట్టాల అవతల ఉన్న రైతులు నాగిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చేందుకు రైల్వే అండర్ పాస్ ద్వారా రాకపోకలను సాగించాల్సి ఉంటుంది. సర్వే నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామ రైతులు అధికారుల వద్దకు వచ్చి వారిని నిలదీశారు.
రాజనెల్లి-పీచెర్యాగడి గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ వర్షాకాలంలో నీరు నిండి కుంటలా తయారు అవుతుందన్నారు. వర్షాకాలంలో పీచెర్యాగడి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. బైకులు, కార్లు రైల్వే అండర్ పాస్‌లోని నీటిలో మునిగిపోయే అవకాశం ఉందన్నారు. రైల్వే అధికారులు పనులను వెంటనే నిలిపివేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆర్ఐ సత్యనారాయణ, సర్వేయర్ నర్సింహులు, రైల్వే అధికారులు, మాజీ సర్పంచ్ అంజయ్య, మొగులయ్య, టంటం శ్రీనివాస్, పాల్గొన్నారు.
రైల్వే గేటును మూసివేసి పట్టాల కింద నుంచి రోడ్డు వేస్తామని రైల్వే అధికారులు అంటున్నారు. మా చేను మధ్యలో నుంచి రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాల కింద నుంచి రోడ్డు వేస్తే మళ్లీ మా భూమి పోతుంది. మాకు నష్టపరిహారం ఎవరు ఇస్తరు. మా పట్టా భూమిలో సర్వే చేస్తే ఎట్లా. పనులు ఆపాలని ఎంతమందికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. – కృష్ణారెడ్డి, రైతు, నాగిరెడ్డిపల్లి