సిద్దిపేట, ఫిబ్రవరి 7: ఈనెల 9 నుంచి 11 వరకు జరిగే సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ లక్ష్మీనరసింహస్వామి జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నిర్వాహకులకు సూచించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు, గ్రామ నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హరీశ్‌రావును కలిసి పుల్లూరు బండ జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు మంచినీటి వసతి, అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. బండపై ఉన్న గుండాల్లో స్నానాలు చేసే భక్తులకు ప్రమాదం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల దర్శనం కోసం అవసరమైన క్యూలైన్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సుమారు మూడున్నర కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. బండపైకి వాహనాలు వెళ్లేందుకు రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించామన్నారు. మరో రూ.35 లక్షలతో ఆలయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. రూ.10 లక్షలతో ఆలయం చుట్టూ షెడ్ నిర్మించామని, బండపై మంచినీటి సమస్యను శాశ్వత పరిష్కారం కోసం రూ.80 లక్షలతో లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకును నిర్మించామని తెలిపారు. రూ.50 లక్షలతో బండపై కళ్యాణ మండపం, రూ.20 లక్షలతో సుడా పారు నిర్మించామని చెప్పారు. రూ.10 లక్షలతో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని, పుల్లూరు గ్రామ స్టేజీ వద్ద రూ.15 లక్షలతో ఆలయ కమాన్ నిర్మించామని వివరించారు. భవిష్యత్‌లో నిధులు కేటాయించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆహ్వాన పత్రిక అందజేసినవారిలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రంగాచార్య, పొడిచేటి రామకృష్ణ, మాజీ సర్పంచ్ నరేశ్‌గౌడ్, ఎంపీటీసీ లతావెంకట్, మాజీ ఉపసర్పంచ్ ప్రసాద్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు మల్లేశం, వినయ్, పురోహితుడు సుబ్రహ్మణ్యం ఉన్నారు.
అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు(చిన్నా)ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం పరామర్శించారు. వెంకటేశ్వర్రావు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న పాలమాకుల పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.
చేర్యాల, ఫిబ్రవరి 7 : జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉల్లెంగల ఏకానందం, మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, చేర్యాల ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.