సంగారెడ్డి మే 7(నమస్తే తెలంగాణ): ప్రజాపాలన అందించడంలోనే కాదు అధికారిక సమావేశాల నిర్వహణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ‘దిశ’ సమీక్షా సమావేశం ఇందుకు ఉదాహారణ. సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ‘దిశ’ సమావేశానికి నేషనల్ హైవే కాంట్రాక్టర్, కన్సల్టెంట్ హాజరు కావడం కలకలం రేపింది. ఉన్నతాధికారుల తరహాలోనే సమావేశానికి హాజరుకావడమే కాకుండా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అంతటితో ఆగకుండా నేషనల్ హైవేల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ జాప్యం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేశారు. దీంతో ఖంగుతున్న రెవెన్యూ అధికారులు ఎంపీలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్ష చివర వరకు సమావేశంలో మాట్లాడింది ఇద్దరు ఉన్నతాధికారులు కాదని కాంట్రాక్టర్, కన్సల్టెంట్ అని తేలడంతో సమావేశానికి హాజరైన వారంతా బిత్తరపోయారు. ఎంపీలు జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలలకు ఒకసారి నిర్వహించే దిశ సమావేశానికి కాంట్రాక్టర్, కన్సల్టెంట్ ఎలా వస్తారని ప్రశ్నించారు. సమావేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఎంపీలు కాంట్రాక్టర్, కన్సల్టెంట్‌ను ఆదేశించారు.దీంతో వారు పలాయనం చిత్తగించారు.
తామే అధికారులమన్న తరహాలో వ్యవహరించి…
కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమీక్షించేందుకు దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగింది. ఎంపీలు సురేశ్‌షెట్కార్, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, టీజీఐఐసీ చైర్‌పర్పన్ నిర్మలారెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే ఎంపీలు నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షించారు. సమావేశానికి నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ హాజరు కావాల్సి ఉండగా ఆయన కార్యాలయం తరపున కన్సల్టెంట్ సంజయ్ డోంగ్రే, కాంట్రాక్టర్ నాగరాజు హాజరుయ్యారు.
సమావేశంలో పాల్గొన్న ఎంపీలు పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు హైవే నిర్మాణం, సంగారెడ్డి నియోజకవర్గంలోని పెద్దాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన సర్వీస్‌రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం అవుతుందని ప్రశ్నించారు. దీనికి అధికారుల తరహాలోనే కన్సల్టెంట్, కాంట్రాక్టర్ మైకు తీసుకొని మాట్లాడారు. నేషనల్ హైవే అథారిటీ వైపు జాప్యం ఏమీలేదని భూసేకరణలో రెవెన్యూ అధికారుల జాప్యం వల్లనే పనులు వేగంగా సాగడంలేదని తెలిపారు. దీనికి సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి వివరణ ఇస్తూ సర్వీసు రోడ్డ నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమిలో ప్రార్థనాస్థలం ఉందని అందుకే జాప్యం జరుగుతుందని వివరణ ఇచ్చారు.
ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ హైవేల నిర్మాణం కోసం ప్రార్థనా మందిరాలను తొలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. ప్రార్థనామందిరాల భూమిని సేకరించి వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇదే క్రమంలో ఎంపీలు నేషనల్ హైవే అథారిటీ రహదారుల నిర్మాణంపై ప్రశ్నలు అడుగుతున్న క్రమంలో అప్పటి వరకు మాట్లాడుతూ వచ్చిన సంజయ్ డోంగ్రో, నాగరాజు నేషనల్హైవే అథారిటీ అధికారులు కాదని ఒకరు ప్రైవేట్ కన్సల్టెంట్ కాగా మరొకరు నేషనల్ హైవే నిర్మాణం పనులు చేపట్టే కాంట్రాక్టర్‌గా గుర్తించారు. వెంటనే ఇద్దరినీ సమావేశం నుంచి బయటకు పంపించి వేశారు. దీంతో ఎంపీలు జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమావేశంలో అధికారులు పాల్గొనాల్సి ఉండగా కన్సల్టెంట్, కాంట్రాక్టర్ ఎలా పాల్గొంటారని అసహనం వ్యక్తం చేశారు.