గుమ్మడిదల,ఫిబ్రవరి11: పచ్చని అడవిని చెత్తకంపుతో పాడుచేస్తానంటే ఊరుకునేది లేదని గుమ్మడిదల రైతు జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షనాయకులు, అన్ని కుల, మహిళా, రైతు సంఘాల నాయకులు, పలు గ్రామాల ప్రజలు సంయుక్తంగా మంగళవారం జాతీయ రహదారి 765డీపై పాడిరైతులు,బర్రెలు, ఆవులు, దున్నపోతులతో నిరసన వ్యక్తం చేశారు. దున్నపోతులపై డంపింగ్‌యార్డు మాకొద్దు.. మాకడుపులు కొట్టొద్దు అంటూ వినూత్నంగా రాశారు.
కొత్తపల్లి, నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో ఏడో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కొత్తపల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కి వినూత్నంగా యువకులు ఆందోళన చేశారు. మున్సిపాలిటీ కేంద్రంలో రైతు జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షను ప్రారంభించారు. రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఫయాజ్షరీఫ్, హుస్సేన్, మాజీ సర్పంచ్‌లు శంకర్, ఆంజనేయులు,తులసీదాసు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు రిలే నిరాహారదీక్షలో పాల్గొని నినాదాలు చేశారు.
అడవులు, రైతులు, గాలి, నీటిని రక్షించాలని జనచైతన్య కళాకారుడు ఎల్లయ్య జానపదగేయాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈసందర్భంగా జేఏసీ కమిటీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ డంపింగ్‌యార్డు పనులను వెంటనే నిలిపి వేసి అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.