దుబ్బాక, జూన్ 19: ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని ఒట్టేసి లోబర్చుకుని ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఓ మహిళ ప్రియుడి ఇంటి ఎదుట బంధువులు, గ్రామైక్య సంఘాల అండతో ధర్నాకు దిగింది. బాధిత మహిళ ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లికి చెందిన పల్లె కవిత, అదే గ్రామానికి చెందిన పల్లె శ్రీకాంత్ ఎనిమిదేండ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల పెండ్లి విషయం ప్రస్తావించగానే శ్రీకాంత్ ముఖం చాటేస్తున్నాడని కవిత ఆరోపించింది. ఈ విషయంపై గ్రామంలో నిర్వహించిన పంచాయితీలో సైతం పెండ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీకాంత్ ఇప్పుడు పెండ్లికి నిరాకరిస్తున్నడని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రులే పెండ్లికి అడ్డు పడుతున్నారని ఆరోపించింది. రెండేండ్ల కిందట పెండ్లి : రెండేండ్ల కిందట కవితను శ్రీకాంత్ సిద్దిపేటలోని ఓ గుడిలో పెండ్లి చేసుకున్నాడు. ఫొటో ఆధారాలను బాధితురాలి బంధువులు చూపించారు. పెండ్లి చేసుకున్న సమయంలో వారు మైనర్లుగా ఉన్నారని తెలిపారు. మేజర్లు అయి న తర్వాత పెండ్లి చేస్తామని చెప్పిన శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇప్పుడు మాట మార్చారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరిగే వరకు శ్రీకాంత్ ఇంటి ఎదుట నుంచి కదలనని భీష్మించుకొని కూర్చింది. శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి గ్రామం విడిచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన ఘటనాస్థలానికి చేరుకుని కవితకు అండగా నిలిచి నిరసనలో పాల్గొన్నారు.