సంగారెడ్డి జిల్లాలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ నిషేధిత జాబితాలోకి నెట్టింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం ఫలితంగా పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని నివాసగృహాలు, లేఔట్లు, వ్యవసాయ భూములు 22-ఏ నిషేధిత జాబితాలోకి చేరాయి.
నివాసగృహాలు, గ్రామ కంఠాలు, పాత లేఔట్లు నిషేధిత జాబితాలో చేర్చారు. నివాసగృహాలు, వ్యవసాయేతర భూములను నివాసం అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, చెరువు శిఖం లేదా సీలింగ్ భూములుగా రికార్డుల్లోకి చేర్చారు. ఏండ్లగా నివాసం ఉంటున్న ఇండ్లు అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో ప్రత్యక్షం కావడంతో సామాన్య ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన లేఔట్లు సైతం 22-ఏ నిషేధిత జాబితాలోకి చేరాయి.
సంగారెడ్డి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ వ్యాపారం పడిపోయింది. తాజాగా ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను సైతం 22ఏ జాబితాలో చేర్చడంతో రియల్ వ్యాపారం మరింత కుదేలు కావడంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు మండలాల్లోని వ్యవసాయ భూములు, అసైన్డ్భూములు, దేవాదాయ, వక్ఫ్‌భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22ఏ విషయంలో అధికారులు మౌనం వహిస్తున్నారు. జాబితా వివరాలు వెల్లడించడం లేదు. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఓపెన్ ప్లాంట్లు, అపార్టుమెంట్ల క్రయవిక్రయాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో రియల్ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది.
హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పటాన్చెరు,సంగారెడ్డి నియోజకవర్గాల్లో రియల్ వ్యాపారం కొనసాగుతున్నది. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఔటర్ రింగ్‌రోడ్డు చు ట్టూ అమీన్పూర్, బీరంగూడ, కొల్లూరు, పటాన్చెరు,ముత్తంగి తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేసి విల్లాలు, ఆపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం బడా రియల్ఎస్టేట్ వ్యాపారుల వెంచర్లు ఉన్న వ్యవసాయేతర భూములను 22ఏ జాబితాలో చేర్చింది. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు తాముకట్టిన విల్లా లు, ఆపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో 22-ఏజాబితాలో తమ ప్రైవేట్ ఆస్తులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులను కలిస్తున్నారు.
22-ఏ జాబితా నుంచి పేర్లు తొలిగించాలంటే ప్రైవేట్ ఆస్తి విలువలో 30 శాతం డబ్బులు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కోరిన డబ్బులు ఇస్తే వారి ఆస్తులు రాత్రికిరాత్రి 22-ఏ నుంచి ఆస్తుల జాబితా తొలిగిపో యి రిజిస్ట్రేషన్లకు దారి క్లియర్ అవుతుంది. డబ్బులు లేని మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు 22-ఏ జాబితా నుంచి తమ ఆస్తులను క్లియర్ చేయించుకునేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోంది.
22ఏ నిషేధిత జాబితా విషయంలో జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ యంత్రాంగం మౌనం వహిస్తోంది. 22ఏ నిషేధిత జాబితాలోని వివరాలను రెవెన్యూశాఖ బయటపెట్టడంలేదు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 22-ఏ జాబితాలోని ప్రైవేట్ ఆస్తుల జాబితాను ఆన్లైన్లో పొందుపర్చాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే 22-ఏ నిషేధిత జాబితా నుంచి తమ ప్రైవేట్ ఆస్తులు తొలిగించాలంటూ బాధితులు తహసీల్, ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి తమ పేర్లు తొలిగించాలంటూ 100 మందికిపైగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పటాన్చెరు నియోజకవర్గంలో రూ. కోట్లు విలువచేసే ప్రైవేట్ ఆస్తులు 22-ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు.