గజ్వేల్, అక్టోబర్ 29: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో పంటరుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అక్కారం, బంగ్లావెంకటాపూర్, గిరిపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేండ్లలో వ్యవసాయం పండుగలా సాగిందని, రైతు సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అధికారులు, స్థానిక నాయకులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరించాలన్నారు. సన్నధాన్యంతో పాటు దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, ఏపీఎం దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్‌లు బాల్‌చంద్రం, బాపురెడ్డి, సీసీలు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌టౌన్,అక్టోబర్ 29: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ మనుచౌదరి సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించే యంత్రాన్ని పరిశీలించి, ఇప్పటివరకు ధాన్యం ఎంతవరకు కొనుగోలు చేశారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి ఎండీ. జైనులొద్దిన్కు సూచించారు. మార్కెట్‌యార్డులోని ఆరుషెడ్లలో ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉందని, మిగతా షెడ్లలో ఏమి ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ధాన్యం ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నందున షెడ్లను సరిపడ ఖాళీగా ఉంచేందుకు ప్రయత్నించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవో రామ్మూ ర్తి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జగదేవపూర్, అక్టోబర్29: దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఏ సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మం డల కేంద్రంతో పాటు పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. ఏవో వసంతరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, పీర్లపల్లి, ఇటిక్యాల మాజీ సర్పంచ్‌లు యాదవ రెడ్డి, చంద్రశేఖర్ ఎంపీటీసీ కిరణ్‌గౌడ్, మహేందర్‌రెడ్డి మహిళా సంఘం అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.