మెదక్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. రైతులకు చేయూతనివ్వాల్సిన పీఏసీఎస్‌లు వారిని దోచుకుంటున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో అక్రమారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. చేగుంట మండ లం ఇబ్రహీంపూర్ పీఏసీఎస్‌లో ఇటీవల భారీ అవినీతి వెలుగుచూసింది. టేక్మాల్ పీఏసీఎస్‌లో చైర్మన్‌తో పాటు సీఈవో పై ఆరోపణలు వచ్చాయి. చెప్పుకుంటూ పోతా చాలా సొసైటీల్లో ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
టేక్మాల్ సొసైటీలో భూ కొనుగోలుకు సంబంధించి రూ.27 లక్షలు గోల్మాల్ అయినట్లు తెలిసింది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ పీఏసీఎస్‌లో ఫర్టిలైజర్స్, గన్నీ బస్తాల్లో భారీగా అవినీతి జరిగినట్టు తెలిసింది. మూడు నెలల వ్యవధిలోనే ఫర్టిలైజర్‌కు సంబంధించి రూ.14 లక్షలు స్వాహా కాగా, గన్నీ బస్తాలకు సంబంధించి రూ.25 లక్షల వరకు గోల్మాల్ జరిగింది. ఇబ్రహీంపూర్ సొసైటీ పరిధిలో 23 గ్రామాలు ఉన్నాయి. వీటి కింద 3675 మంది రైతులు ఉన్నారు.
ఈ సొసైటీలో పెద్ద మొత్తంలో స్కాం జరిగింది. సొసైటీలో చైర్మన్, సీఈవోలు ఉండగా సొసైటీ సెక్రటరీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా ఆడిట్ జరిగే సమయంలో విచారణకు వచ్చే అధికారికి మామూళ్లు ఇచ్చి అన్నీ సక్రమంగా ఉన్నట్లు రిపోర్టు ఇప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఏసీఎస్‌లో సమావేశాలు జరిగిన సందర్భంలో గోవా టూరు, జల్సాలకు భారీగా ఖర్చు చేసినట్టు తెలిసింది. రైతులకు సంబంధించిన క్రాప్ లోన్ విషయంలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
మెదక్ జిల్లా టేక్మాల్ పీఏసీఎస్‌కు 2.12 గుంటల భూమిని కొందరు రైతులు సొసైటీకి దానం ఇచ్చారు. కాగా, ఈ భూమికోసం ఈ సొసైటీలో రూ.27.85 లక్షలకు విక్రయించినట్టు చైర్మన్, సీఈవో కమిటీ తీర్మానాలు చేసుకున్నారు. ఇందులో రూ.3 లక్షలు రైతులకు చెల్లించినట్టు, మరో రూ.1.62 లక్షలు స్థలం రిజిస్ట్రేషన్ కోసం చలాన్ కట్టినట్టు తెలిసింది.
ఈ మేరకు 2018లో టేక్మాల్ సొసైటీ సీఈవో పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. భూమిని ఇచ్చిన రైతులకు రూ.3 లక్షలు చెల్లించగా, రూ.27.84 లక్షలకు భూమిని కొన్నట్టు రిజిస్ట్రర్ డాక్యుమెంట్లో రాశారు. దీంతో సొసైటీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. టేక్మాల్ మం డలం ధన్నారంలో 2020లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో కూడా అక్రమాలు జరిగినట్టు తెలిసింది. ఈ బంక్ కోసం 25 సంవత్సరాలకు లీజుకు తీసుకొని నెలకు రూ.10వేలు అద్దెను చెల్లించినట్టు తెలిసింది.
ఈ బంక్‌ను ఆరు నెలల వరకు నడిపించి ఆ తర్వాత మూసివేశారు. ఇందులో కూడా రూ.13 లక్షలు నష్టం వచ్చినట్టు సొసైటీ చైర్మన్, సీఈవోలు చూపించారు. విచారణ జరిపితే టేక్మాల్ సొసైటీలో జరిగిన అవినీతి బయటపడే అవకాశం ఉంది. ఇబ్రహీంపూర్, టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవినీతిపై మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ దృష్టిపెట్టాలని రైతులు కోరుతున్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా ఇప్పటి వరకు ఆడిట్ అధికారులు రిపోర్ట్ ఇవ్వలేదు. సొసైటీలపై విచారణ జరపాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ స్పందించి సమగ్ర దర్యాప్తు జరిపి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సొసైటీల్లో అవినీతి జరిగితే దానికి సొసైటీ చైర్మన్, సీఈవోలదే బాధ్యత. సొసైటీలో ప్రతి ఖర్చు కోసం చైర్మన్, సీఈవోల జాయింట్ అకౌంట్లో నుంచే డబ్బులను డ్రా చేస్తారు. టేక్మాల్, ఇబ్రహీంపూర్ సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంది. మెదక్ ఆర్డీవో సమక్షంలో టేక్మాల్ సొసైటీపై విచారణ జరుగుతున్నది. వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
-కరుణ, జిల్లా సహకార అధికారి, మెదక్ జిల్లా