దుబ్బాక, జనవరి 25: పుణ్యక్షేత్రాలు, పురాతన ఆలయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ‘ప్రసాద్’ పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్ని మూడేండ్ల కిందట ప్రసాద్ పథకానికి ఎంపిక చేసినా ఇప్పటికీ పైసా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఎలాంటి పనులు జరగడం లేదు. రామేశ్వరంపల్లి శివారులోని రామలింగేశ్వర ఆలయానికి 887, 888, 889,890 సర్వే నంబర్లలో మొత్తం తొమ్మిది ఎకరాల మూడు గుంటల భూమి ఉంది. ఇందులో నుంచి ప్రసాద్ పథకానికి కావాల్సిన ఎకరం స్థలాన్ని అధికారులు 2022లో కేటాయించి అప్పగించారు.
ప్రసాద్ పథకం ప్రకారం ఆలయం వద్ద కేటాయించిన ఎకరం స్థలంలో తీర్థయాత్ర సమాచార కేంద్రం, ప్రసాదం కౌంటర్, విశ్రాంతి వేదిక, వాష్‌రూమ్, మూత్రశాలలు, తాగునీటి వసతి, పాదరక్షల (చెప్పుల)స్టాండు, ప్రథమ చికిత్స కేంద్రం, క్లాక్ రూమ్, క్యాంటిన్, ఏటీఎం, స్టాల్స్, సిట్టింగ్ బెంచీలు, మల్టీ పర్పస్హాల్, పార్కింగ్, సోలార్ ప్యానెల్, రేయిన్ వాటర్ హార్వెస్టింగ్, సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్, డస్ట్‌బిన్స్, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంపౌండ్‌వాల్, సెక్యూరిటీ సర్వేలైన్స్, సీసీ టీవీ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు 2022లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, కేంద్ర పర్యాటక శాఖలకు పంపించారు. గతంలో సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి మట్టి నమూనాలు తీసుకువెళ్లారు.
కానీ, నిధులు రావడం లేదు, అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు. 2022లో అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడవెల్లి రామలింగేశ్వర ఆలయానికి ప్రసాద్ పథకం ద్వారా రూ.కోటి రూపాయలు మంజూరు చేయించానని గొప్పగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన మెదక్ ఎంపీగా ఉన్నా, ప్రసాద్ పథకంలో కూడవెల్లి ఆలయానికి పైసా నిధులు మంజూరు కాలేదు. మాండవ్యనది పరీవాహకం పక్కనే చూడముచ్చటగా కూడవెల్లి ఆలయాల సమూహం ఉంటుంది. రామలింగేశ్వర స్వామి ఆల యం, వేణగోపాల స్వామి, ఆంజనేయ స్వామి, కాశీవిశ్వనాథ, భైరవ, బొబ్బిలి వీరన్నస్వామి ఆలయాల సమూహంతో కలిసి ఉంటుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు కావడంతో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.
ప్రసాద్ పథకంలో భాగంగా కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం ఎంపికైంది. ఆలయం వద్ద ఎకరం స్థలం కేటాయించాం. మూడేండ్ల నుంచి ఆలయం వద్ద ఎలాంటి పనులు జరగలేదు. కేవలం మట్టి నమూనాలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు జరగడం లేదు. ప్రస్తుతం ప్రసాద్ పథకం ఊసే లేదు. ఏటా ఆలయం వద్ద మాఘ అమావాస్యకు జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మౌలిక వసతులు కల్పిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.
– శ్రీధర్‌రెడ్డి, కూడవెల్లి రామలింగేశ్వర దేవాలయ ఈవో, సిద్దిపేట జిల్లా