Power Cuts | పాపన్నపేట, మార్చి 22 : ఒకవైపు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాగానే పాపన్నపేట మండలంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం పాపన్నపేట మండలంలో చిన్నపాటి గాలివాన ప్రారంభమయ్యిందో లేదో.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి అంతా మండల పరిధిలోని దాదాపు అధిక శాతం గ్రామాల్లో కరెంటు పోయింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కరెంటు లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కరెంటు లేకపోవడంతో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పడరానికి పాట్లుపడ్డారు. శనివారం ఉదయం కూడా కరెంటు పోవడంతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పరీక్ష కేంద్రాలలో ఫ్యాన్లు నడవక ఉక్క పోతకు గురయ్యారు.
ఇది ఇలా ఉండగా కరెంట్ లేకపోవడంతో రాత్రంతా దోమల బెడదతో జాగరణ చేయాల్సి వచ్చింది. దీంతో చేసేది లేక మండల ప్రజలు కరెంటు ఎప్పుడు వస్తుంది అంటూ వివిధ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు చేసిన ఏ ఒక్క అధికారి కనీసం స్పందించలేదు, ఇక విద్యుత్ శాఖ ఏఈ నర్సింలు కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని పాపన్నపేట మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇకనైనా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.