మెదక్, మార్చి 28(నమస్తే తెలంగాణ) : అస్తవ్యస్త కరెంట్ సరఫరా, లోవోల్జేజీ సమస్యలతో బోరుమోటర్లు కాలిపోతుండడంతో మెదక్ జిల్లా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండడం ఓవైపు, అప్రకటిత విద్యుత్ కోతలు మరోవైపు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కండ్లముందు పంటలు ఎండిపోతుండడంతో అన్నదాతలు నారాజ్ అవుతున్నారు. సింగూరు నీరు రాక ఘనపూర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయి.
మెదక్ జిల్లాలో 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 10, 33/11 కేవీ సబ్స్టేషన్లు 125 ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 1,11,674, గృహజ్యోతి కనెక్షన్లు 1,28,739, గృహ విద్యుత్ కనెక్షన్లు 2,40,174, పరిశ్రమల కనెక్షన్లు 2,411 ఉన్నాయి. మెదక్ జిల్లాలో సాగుభూమి 3.97 లక్షల ఎకరాలు ఉండగా.. రైతులు 2.98 లక్షల మంది ఉన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను కేసీఆర్ బలోపేతం చేశారు. మెదక్ జిల్లాలో యాసంగిలో 2.69 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. వ్యవసాయానికి ఉచితంగా 24గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. కానీ, పగలు, రాత్రి కలిపి 12 గంటలు మాత్రమే కరెంట్ వస్తున్నదని రైతులు తెలిపారు.
రాత్రి కరెంట్ సరఫరా తో రైతులు పారకం పెట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా కావడం లేదు. రాత్రి 6 గంటలు, పగలు 6 గంటలు మాత్రమే కరెంట్ వస్తున్నదని, పలుమార్లు బంద్‌చేసి ఆన్ చేస్తున్నారని రైతులు తెలిపారు. లోవోల్టేజీతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోయి తమకు భారం అవుతున్నదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, కూరగాయ పంటలు ఎక్కువగా సాగుచేశారు. బోరు మోటర్లు కాలిపోతుండడంతో మరమ్మతులకు రైతులు రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెరిగి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రభుత్వం కరెంట్ సరిగా ఇవ్వడం లేదు. పంటలు ఎలా కాపాడుకోవాలి. 30 గుంటల్లో వరి నాటేసిన. కరెంట్ తక్కువ ఇస్తుర్రు. బోరు సరిగా నీరు పోస్తలేదు. ఆరుకుంట ఆరుకుంట పారపెడుతున్న. కాల్వ వచ్చి ఉంటే నీళ్లు ఉండేవి. కాలువ నీరు వస్తే పది ఎకరాల దాకా పంట సాగు చేస్తుంటి. కాల్వలో సాగునీరు రాదని తెలిసి జరంతనే పొలం ఏసిన. అయిన పారుతలేదు. వరి పొట్ట దశలో ఉంది. ఘనపూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే వరి పంటకు మేలు కలుగుతుంది. కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది.
-ఆకుల శంకరయ్య, రైతు, రాంపూర్ (మెదక్ జిల్లా)