చేగుంట, ఫిబ్రవరి 28: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లిలో తెల్లారితే కరెంట్ కట్. 45 రోజులుగా అదే పరిస్థితి… సమస్య పరిష్కరించాలని విద్యుత్ అధికారులను కోరితే స్పందించకపోవడంతో శుక్రవారం కర్నాల్‌పల్లి గ్రామస్తులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. కర్నాల్‌పల్లి బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై సగానికి పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 45 రోజుల నుంచి రోజు ఉదయం కరెంట్ పోతుండడంతో ఇబ్బందిగా మారింది.
ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో ఎక్కువ విద్యుత్ వాడకం వల్ల కరెంట్ ట్రిప్ అవుతుందని, గ్రామస్తులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదని ఆరోపించారు. రోజూ తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖ అధికారులు స్పందించి అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేసి తెగిపోయిన విద్యుత్ వైర్లను సరిచేసి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఏఈ 20 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ పంపినా దానిని బిగించలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏఈ భారత్‌ను వివరణ కోరగా కర్నాల్‌పల్లిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఉదయం విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడం, ఓవర్ లోడ్ కారణంగా సరఫరాలో అంతరాయం కలుగుతుందని, రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు.