జహీరాబాద్, ఏప్రిల్ 24: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదాపడింది. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారని బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కమిషనర్ జేతురామ్నాయక్ను నిలదీశారు.
మున్సిపల్ చైర్మన్ అనార్యోగం కారణంగా ఎన్నికకు హాజరుకావడం లేదని, కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జేతురామ్నాయక్ ప్రకటించారు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ అనారోగ్యం సాకు చూపి ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని మున్సిపల్ కమిషనర్‌ను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ హాజరుకాకపోయినా ఎన్నిక నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్‌పై ఎమ్మెల్యే, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకపడటంతో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని హితవు పలికారు. మున్సిపల్ చైర్మన్ స్వయంగా ఆహ్వానించి ఆనారోగ్యంసాకుతో తమను ఉద్దేశ పూర్వకంగానే అవమానపర్చేందుకు ఎన్నికలు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికను ఉద్దేశ పూర్వకంగానే వాయిదా వేసి అవమాన పర్చారని బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశ మందిరంలో బైఠాయించారు.
మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కమిషనర్, సంబంధితశాఖ అధికారులు కౌన్సిల్ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఆగ్రహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆందోళనకు దిగారు. ఆనంతరం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, సంఖ్యాబలం లేక చైర్మన్, కౌన్సిలర్లు కావాలనే గైర్హాజరయ్యారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ అనారోగ్యంసాకుతో ప్రజాసామ్య ప్రక్రియను కాలరాస్తున్నారన్నారు. భవిష్యత్‌లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తగినమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.