సంగారెడ్డి, అక్టోబరు 22: జిల్లాకేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జాదారులు కాకుల్లా వాలిపోతున్నారు. కాలనీ ఏదైనా డోంట్‌కేర్ అంటూ కబ్జాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలనే కలెక్టర్ వల్లూరిక్రాంతి ఆదేశాలను రెవె న్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు విస్మరిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సర్వేనంబర్ 374కు పక్కన ప్రైవేట్ వెంచర్ ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నది. ప్రభుత్వ స్థలంలో ఏకం గా ఇంటి నిర్మాణానికి పిల్లర్ల గుంతలు తీశారు.
ప్రస్తుతం మార్కెట్ ప్రకారం కబ్జాకు గురవుతున్న ఈ స్థలం గజానికి రూ.లక్ష ధర పలుకుతున్నదని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. సుమారు1200 పైచిలుకు గజాల స్థలానికి రూ.12 కోట్లకు పైగా ధర పలుకుతుందని అం చనా. వెంచర్ చివరలో ఉన్న ఆరుగురు ఇండ్ల యజమానులు తమ ఇంటి ముందున్న ప్రభుత్వ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తొలి ప్రయత్నంగా ఒక యజమాని ధైర్యం చేసి అక్రమ నిర్మాణానికి తెరలేపారు. దీనికి పరోక్షంగా స్థానిక వార్డు కౌన్సిలర్ తనయుడు కీలక పాత్ర పోషిస్తూ అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి బదిలీ అయిన అధికారి ఈ స్థలానికి 58,59 జీవో ప్రకారం పాత తేదీల్లో క్రమబద్ధ్దీకరణ చేసినట్లు సమాచారం బయటకు పొక్కింది. అందుకు మున్సిపల్ అధికారులు సైతం నకిలీ రసీదులతో అనుమతులు ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. దీన్ని పూర్తిగా కౌన్సిలర్ కుమారుడు దగ్గరుండి నకిలీ పత్రాలు, క్రమబద్ధ్దీకరణకు సంపూర్ణ సహకారం అందించారని ప్రచారం జరుగుతున్నది. లీగల్‌గా ఇబ్బందులు వస్తే తానే న్యాయవాదినని, ఏమైనా ఉంటే కోర్టులో చూసుకుంటానని కబ్జాదారులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం..
బైపాస్ రోడ్డులోని 374 సర్వేనంబర్‌లో ప్రభు త్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి పిల్లర్లు వేసేందుకు గుంతలు తీసిన విష యం మాదృష్టికి వచ్చింది. ఆర్ఐను పం పించి సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలు, చెరువు లు, కుంటల శిఖం భూములను పరిరక్షించేందుకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలో ఎవరైనా, ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి కటకటాలకు పంపిస్తాం.
– దేవదాస్, తహసీల్దార్, సంగారెడ్డి