హుస్నాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువులో రూ.5.17 లక్షలతో 3లక్షల చేపపిల్లలను శనివారం వారు వదిలారు. అనంతరం పట్టణంలోని వెటర్నరీ దవాఖాన, చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చెరువుకట్టపై జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల చెరువుల్లో 84కోట్ల చేపపిల్లలు, 10కోట్ల రొయ్య పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చేప పిల్లల పంపిణీ పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ బోర్టులు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు.
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో వేసిన చేపపిల్లల ద్వారా పట్టణంలోని 253 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 165 చెరువుల్లో రూ.38.92 లక్షల విలువైన చేపపిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. తద్వారా 4144మంది మత్స్యకారులు ఉపాధి లభిస్తుందని మంత్రులు అన్నారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5లక్షల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చేప పిల్లలు సరైన సైజు పెరిగిన తర్వాత విక్రయించాలని సూచించారు.
హుస్నాబాద్‌లో వెటర్నరీ నూతన భవనం నిర్మాణం, వైద్యుల నియామకం, ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణం, పాల శీతలీకరణ కేంద్రం మంజూరు చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. గురుకులాల్లో చికెన్, మటన్‌తో పాటు చేపలు కూడా మెనూలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కలెక్టర్ కె.హైమావతి, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హస్నాబాద్, కోహెడ మార్కెట్ చైర్మన్లు తిరుపతిరెడ్డి, నిర్మల, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మత్స్య సహకార సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.