హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 1: పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, సన్నబియ్యం పథకం చరిత్రలోనే నిలిచిపోతుందని రా్రష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని బేడబుడిగ జంగాల కాలనీలో మంగళవారం సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి సన్నబియ్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల ద్వారా 2,91,000 లక్షల కుటుంబాలకు సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు పావలా వడ్డీని సైతం ప్రభుత్వమే అందిస్తున్నదని, విద్యార్థులకు సైతం కాస్మోటిక్స్ చార్జీలు, మెస్‌చార్జీలను సైతం పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అయన అన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో రామమూర్తి, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్‌విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ బంక చందు, తహశీల్దార్ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సన్నబియ్యం పథకం ప్రారంభ కార్యక్రమంలో రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వస్తుందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ సభికులను అడిగారు. సార్.. గ్యాస్ డబ్బులు వస్తలేవు అంటూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన చింతల లలిత అనే మహిళ అడిగింది. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గ్యాస్ డబ్బుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ గ్యాస్ డబ్బులు వచ్చేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.