హుస్నాబాద్, జూలై 18: హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆరెపల్లిలో త్రిశూలం ఫౌంటేన్ ప్రారంభం, సర్కారు దవాఖాన ఆకస్మిక తనిఖీ, ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నదన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 340 హోటళ్లకు 34వేల స్టీల్ గ్లాసులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. పెండ్లిళ్లు, శుభకార్యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రజలు వాడొద్దన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25సంవత్సరానికి హుస్నాబాద్ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 139వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించడం హర్షణీయమన్నారు. ఇందుకు కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. పారిశుధ్య కార్మికులకు టీషర్ట్స్, మిఠాయిలు పంపిణీ చేశారు.
పచ్చదనం, పరిశుభ్రతలో నంబర్‌వన్‌గా ఉన్నామని, రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా కొనసాగించాలని కోరారు. పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులు పూర్తవుతున్నాయని, వర్షాకాలంలో ఇండ్లలోకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం సర్కారు దవాఖానను సందర్శించి రోగులతో మాట్లాడారు. దవాఖానకు వాటర్ ప్లాంట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.