పటాన్చెరు, డిసెంబర్ 2: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ నాయకులు హాస్టళ్లను సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్నకంజర్లలోని మహాత్మాజ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు వెళ్లారు.
అప్పటికే గేటు ముందు పహారా కాస్తున్న పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని చెబుతూ గేట్లు మూసివేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు కమ్మెట చెన్నారెడ్డి, నాయకులు మాణిక్యాదవ్, సాయికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించడం కూడా కాంగ్రెస్ నిషేధించడం విచారకరమన్నారు.
ప్రభుత్వం హాస్టళ్లను నిర్లక్ష్యం చేస్తూ బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాస్టళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇస్తే కాంగ్రెస్ హాస్టళ్లలో పురుగులు పట్టిన, పాచిపోయిన అన్నం పెడుతూ వారి ఆరోగ్యాలను పాడుచేస్తున్నదని ఆరోపించారు. పోలీసుల పహారాలో విద్యాసంస్థలు, హాస్టళ్లు ఉంచడం ప్రజలు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.