దుబ్బాక, సెప్టెంబర్ 13 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులను పోలీసులతో నిర్బంధించడమేనా కాంగ్రెస్ ప్రజాపాలన అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ సర్కారు మరో నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని శుక్రవారం వేకువజామున పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
అర్ధరాత్రి నుంచే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను ఇంటి నుంచి బయటకు కాలు పెట్టకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్బంధంలో ఉన్నా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తాను మాట్లాడిన వీడియోను దుబ్బాక విలేకరులకు, సోషల్ మీడియా లో షేర్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై, ఎమ్మెల్యేలపై రేవంత్ సర్కారు కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్‌రెడ్డి, టాస్క్ఫోర్సు ఏసీపీ శశాంక్, మాదాపూర్ సీఐ శేఖర్‌రెడ్డి, మరో ముగ్గురు ఎస్సైలు సాయంత్రం వరకు ఎమ్మెల్యేను బయటకు రాకుండా అక్కడే ఉంటూ నిర్బంధించారు. దుబ్బాకలో శుక్రవారం వేకువజామున బీఆర్ఎస్ నాయకులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దుబ్బాక పట్టణంతో పాటు గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులను వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.