పటాన్చెరు, అక్టోబర్ 20: లక్డారం గ్రామంలో హైదరాబాద్ మహానగర చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలం ఇచ్చే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. లక్డారంలోని సర్వే నెంబర్ 738లోని ప్రభుత్వ, అసైన్ భూములు దాదాపు 220 ఎకరాలను హెచ్ఎండీఏకు స్వాధీనం చేశారు. దానిలోంచి వంద ఎకరాలను జీహెచ్ఎంసీ మహానగర చెత్తను డంప్ చేసేందుకు కావాలని కోరుతున్నది. లేదంటే సర్వే నెంబర్ 747 లోని వంద ఎకరాలు ఇవ్వాలని రెవె న్యూ అధికారులను జీహెచ్ఎంసీ కోరుతున్నది.
ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులు భూముల హద్దులు, భూముల పరిస్థితి ఇతర విషయాలను పటాన్చెరు తహసీల్ కార్యాలయంలో కూపీ లాగుతున్నారు. హెచ్ఎండీఏ అధికారుల లెటర్ ఎల్ఆర్. నెంబర్. ఎస్డబ్ల్యుఎం/0002/2022/ఏఈ-1. (ఎస్డబ్ల్యుఎం) తేది సెప్టెంబర్ 30,2024 ప్రతిని తహసీల్దార్‌కు అందజేశారు. సర్వే నెంబర్ 747లో క్రషర్లు, రైతులకు అసైన్ చేసిన భూములు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో రోజువారీగా పోగవుతున్న చెత్తను పారవేయడం పెద్ద సమస్యగా మారింది. నగరం నలుమూలల చెత్తను వేసి రీసైక్లింగ్ చేయడం, దానిని ఎరువుగా మార్చడం చేయాలనే ఆలోచనతో గ్రేటర్ మున్సిపాలిటీ ఉంది.
ఈ మేరకు నగర శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మం డలం లక్డారం, గుమ్మడిదల మండలం ప్యారానగర్ గ్రామంలో ప్రభుత్వ భూములను ఎంపిక చేసుకున్నారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ ప్యారానగర్లో 152 ఎకరాలను జీహెచ్ఎంసీ డంప్‌యార్డు కోసం కోరింది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. లక్డారంలో భూములు ఖాళీగా ఉన్నవి చూసి ఇక్కడైనా డంపింగ్ యార్డు పెట్టాలని జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తున్నది. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రం లో ఈ భూముల్లో చెత్త డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. స్థానికులు, నాయకులు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన విరమించారు.
లక్డారం గ్రామం సర్వే నెంబర్ 747లోని వందల ఎకరాలు ఇవ్వలేని పక్షంలో, సర్వేనెంబర్ 738లోని వంద ఎకరాలైన కేటాయించాలని జీహెచ్ఎంసీ కోరుతున్నది. సర్వే నెంబర్ 738లో నాటి ప్రభుత్వం హౌసింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఆలోచించి ఆ భూమిని హెచ్ఎండీఏకు అందజేసింది.హెచ్ఎండీఏ ఆధీనంలోని భూముల్లోంచి వంద ఎకరాలు ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని మహానగర చెత్తను డం పింగ్ చేసే యోచనలో జీహెచ్ఎంసీ ప్రణాళికా రచిస్తున్నది.
వచ్చిన చెత్తను ఆధునిక పద్ధ్దతుల్లో శుద్ధిచేసి రీసైక్లింగ్ అయ్యేలా చూస్తామంటున్నది. లక్డారం గ్రామస్తులు మాత్రం ముక్తకంఠంతో డంపింగ్ యా ర్డు వద్దని కోరుతున్నారు. ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో, నక్కవాగు కాలుష్యంతో తమ ప్రాంతం ఎం తో నష్టపోయిందని, మరోపక్క క్రషర్ల దుమ్ముధూళి తో, గుట్టల్లో బ్లాస్ట్‌లతో గ్రామం భయానకంగా మా రిందంటున్నారు. డంపింగ్ యార్డుతో ఈ ప్రాంతం మురికి కూపంగా మారుతుందని, రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్డారంలో డంప్‌యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.