ఎనిమిదో విడత హరితహారం ప్రారంభం
జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
ఈ నెల 20లోగా ప్రతి ఇంటికీ ఆరు రకాల మొక్కలు
ఆగస్టు 30 లోగా నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు
చెరువులు, కెనాల్స్, పిల్ల కాల్వల గట్లపై నాటేందుకు ఏర్పాట్లు
ముమ్మరంగా గుంతల తీత పనులు
నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటేందుకు వాతావరణం అనువుగా మారింది. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులను యంత్రాంగం వేగవంతం చేసింది. ఈసారి కాల్వల గట్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కువగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టు 30లోగా జిల్లాలో లక్ష్యాన్ని పూర్తి చేయనున్నది. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశం నిర్వహించి, హరితహారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.
సిద్దిపేట, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వృక్షో రక్షతి రక్షితః అన్నారు మన పెద్దలు. సిద్దిపేట జిల్లాను హరిత వనంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరిక్షించే బాధ్యత కూడా వారిదే. ఇవాళ గ్రామాలు, పట్టణాలు పచ్చని చెట్లతో పచ్చలతోరణం తొడిగినట్లుగా మనకు కన్పిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, అక్కడి నుంచే మొక్కలు అందిస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో గ్రామాల్లో ఇంటింటా మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికీ 6 రకాల మొక్కలను అందిస్తున్నారు. ఈ నెల 20 లోగా ప్రతి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతల తీత కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నది. కాల్వల గట్లపై మొక్కలు నాటేలా సిద్ధం చేసి, ఆగస్టు 30లోగా జిల్లాలో లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు చేసింది.
ఎనిమిదో విడత లక్ష్యం 40 లక్షల మొక్కలు
ఎనిమిదో విడత హరితహార కార్యక్రమం కింద జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రతి గ్రామ, పట్టణాలతో పాటు రోడ్లకిరువైపులా మొక్కలు నాటుతారు. ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు ఇలా ప్రతి చోట మొక్కలు పెడుతున్నారు. ఎనిమిదో విడత హరితహారంలో ప్రధానంగా నీటిపారుదల రంగంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. మిషన్ కాకతీయలో భాగంగా పెద్ద ఎత్తున చెరువుల పూడికతీతతో పాటు, చెరువు గట్లను బాగు చేశారు. ఈ చెరువు గట్లపై వివిధ రకాల ఫలాల మొక్కలు నాటనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. ప్రధాన కెనాల్స్‌తో పాటు పిల్ల కాల్వల గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి హరితహరంపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20వ తేదీ లోగా జిల్లాలోని ప్రతి ఇంటికి ప్రజాప్రతినిధులతో కలిసి 6 మొక్కలు అందిస్తున్నారు. గ్రామాల వారీగా మొక్కల పంపిణీ రిజిస్టర్లో నమోదు చేసి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. నెల రోజుల్లోగా 10 ఫీట్ల పొడవైన మొక్కలను రోడ్లకిరువైపులా నాటి, వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా ప్రణాళిక పెట్టుకున్నారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ఆగస్టు 30వ తేదీలోగా మొక్కలు నాటడం పూర్తి చేసి, నాటిన అన్ని రకాల మొక్కలకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. సంబంధిత అధికారులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకే గ్రామాలకెళ్లి ఉపాధి కూలీలను సమీకరించి, హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతారు. కాగా, హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2021-22 సంవత్సరంలో 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా, 42 లక్షల మొక్కలు నాటారు. అటవీశాఖ ద్వారా 2021-22 సంవత్సరంలో 35 హెక్టారులో బ్లాక్ ప్లాంటేషన్, 23.5 కి.మీటర్లలో వెదురు ప్లాంటేషన్, 45.5 కి.మీటర్లలో గచ్చకాయ మొక్కలు నాటారు.
మద్దూరు(ధూళిమిట్ట) : నర్సాయపల్లిలో మొక్కలు నాటుతున్న ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి
దుబ్బాక టౌన్ : హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న కమిషనర్ గణేశ్‌రెడ్డి, చైర్పర్సన్ వనిత, కౌన్సిలర్లు
గ్రామాల్లోనే నర్సరీలు..
జిల్లా ఎనిమిదో విడత హరితయజ్ఞానికి సిద్ధమైంది. 2015వ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో వివిధ రకాల మొక్కలు నాటడంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే నర్సరీలను ఏర్పాటు చేసి, ఆ గ్రామానికి సరిపడా మొక్కలను అందజేస్తున్నారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో నర్సరీ లున్నాయి. వీటిలో 20కి పైగా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇవి కాకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. ఈ మొక్కలు ఎక్కడికి అవసరముంటే అక్కడికి పంపడంతో పాటు రోడ్లకిరువైపులా, అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్నారు. హరితహారం కింద నాటిన మొక్కలను ఎవరైనా పాడు చేస్తే, జరిమానాలు విధిస్తున్నారు.