న్యాల్కల్, ఆగస్టు 29: చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు..ఇంకేముంది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణలో వివాదాలు తలెత్తకుం డా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల్లో ప్రభుత్వ, పట్టాభూములను సేకరించేందుకు సంబంధిత అధికారులు సర్వేలు పూర్తి చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత జిల్లా అధికారులు ఫార్మాసిటీకి కావాల్సిన భూసేకరణను గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదిఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇక్కడ ఫార్మా కంపెనీలు పాగా వేయడం ఖాయం. అదే జరిగితే పచ్చని పల్లెలు కాలు ష్య కోరల్లో చిక్కుకోనున్నాయని ఆయా గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు, రైతలు ఆందోళన గురవుతున్నారు.
ఫార్మాసిటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం..
న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో నిమ్జ్ ఏర్పాటుకు 12,635 ఎకరాలు సేకరించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో ఆయా మండలాల్లో ఇప్పటికే 3,600 ఎకరాల సేకరించింది. హైదరాబాద్ పట్టణానికి ఫార్మాసిటీ పరిశ్రమలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఆయా గ్రామాలను ఎంపిక చేసింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని బీదర్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు అక్కడ ఎయిర్‌పోర్టు, రైల్వేలైన్ అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ఆయా గ్రామాల శివారు గుండా నిజాంపేట్-బీదర్‌కు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫార్మాసిటీలో ఏర్పాటు చేసే ఔషధ కంపెనీలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాంతాలకు చెందిన ఔషధ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఫార్మాసిటీ కోసం న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల్లో 2,003 ఎకరాల భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలోని డప్పూర్ గ్రామ శివారులో 1465.25 ఎకరాలు, మల్గిలో 282.13 ఎకరాలు, వడ్డిలో 256 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను సర్వే చేసి నివేదికలను సంబంధిత జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో భూసేకరణ చేపట్టేందుకు సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గెజిట్ నోటిఫికేషన్ జీవో పత్రాలను అతికించారు.
హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములు ధరలు అధికంగా ఉండడంతో మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చౌకగా ధరలకు లభించే భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కన్నేసింది. ఆయా గ్రామాల శివారులో అధిక మొత్తంలో ప్రభుత్వ భూములు ఉండడంతో భూసేకరణకు ఎలాంటి ఇబ్బందులు ఉం డావని భావించిన ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ప్రమాదపు అంచున పచ్చని పొలాలు, నీటి వనరులు..
ఆయా గ్రామాల శివారు ప్రాంతంలోని పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసే ఫార్మాసిటీతో పర్యావరణం, చెట్లు, చేమ, చెరువులు, కుంటలు, భూమి, మట్టి, నేల, గాలి వంటి అన్నిరకాల సహజ వనరులు కలుషితమై, భవిష్యత్తు తరాల ఉనికే ప్రశ్నార్థకంగా మా రనున్నది. కిడ్నీ సమస్యలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్‌తోపాటు అనేక వ్యాధుల బారిన పడాల్సిన దుస్థితి నెలకొంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలోని పటన్‌చెరు, నర్సాపూర్, హత్నూర్, బుధేరా, దిగ్వాల్ ప్రాంతంలోని రసాయన కంపెనీలతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తమ గ్రామాలకు తప్పవన్నారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీ వ్యర్థాలు విడిచిపెడితే చెరువులు, వాగుల్లోని నుంచి మం డలం మీదుగా ప్రవహించే మంజీరా నదిలోకి చేరే అవకాశం ఉందని పర్యావరణ నిఫుణులు హెచ్చరి స్తున్నారు.గ్రామాల శివారులోని ఎత్తయిన గుట్టలు సైతం కనుమరుగుకానున్నాయి. ఆయా గ్రామాల శివారులోని గుట్టలపై నవనాథ్ సిద్ధలింగేశ్వరస్వా మి, మల్లన్నస్వామి, ఫీర్గైబ్ సాహెబ్ దర్గాలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రానున్నారు. ఫార్మాసిటీలో ఆలయాలు కూడా కనుమరుగుకానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పేర్కొంటున్నారు. అందుకే ఫార్మాసిటీని అడ్డుకోవాలంటున్నారు.
ఫార్మాసిటీపై ఎంపీ సురేశ్ షెట్కార్‌కు రైతుల వినతి
కోహీర్, ఆగస్టు 29 : ఫార్మాసిటీ ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం చేయొద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జహీరాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కు ల పంపిణీ కోసం వచ్చిన ఎంపీ సురేశ్‌షెట్కార్‌ను న్యాల్కల్ మండల డప్పూర్ రైతులు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు అధికారులు గెజిట్ విడుదల చేశారన్నారు. భూసేకరణతో పంట భూములు పోతాయని మొరపెట్టుకున్నారు. అసైన్డ్ భూముల రైతులకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు. ఎలాగైనా ఫార్మాసిటీ కోసం చేపట్టిన భూసేకరణను నిలిపివేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.
ఫార్మాసిటీకి భూములివ్వం..
ఫార్మాసిటీకి సారవంతమైన భూములు అసలే ఇవ్వం. హైదరాబాద్ ప్రాంత శివారులో ఏర్పాటు చేసే ఫార్మాసిటీని కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని పచ్చని పొలాలు, ఎత్తయిన గుట్టలు, ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం సరికాదు. గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు చేపట్టి బలవంతంగా భూమిని సేకరిస్తూ రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెం టనే విరమించుకోవాలి, లేనిపక్షంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
– రవీందర్, రైతు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, న్యాల్కల్ మండలం