మెదక్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ): మెదక్ జిల్లాలో పెట్రో, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో బంకుల నిర్వాహకులు బుధవారం బంకులు మూసివేశారు. మెదక్ జిల్లాలో 87 పెట్రోల్ పంపులు, 16 గ్యాస్ డీలర్లు ఉన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో బుధవారం నిర్వాహకులు ఉదయం నుంచి బంక్‌లు మూసివేశారు. ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా, కంపెనీల నుంచి సరిపడా సరఫరా లేదని బంకుల యాజమాన్యాలు చెబుతున్నారు.

మెదక్ పట్టణంలో బుధవారం ఉదయం నుంచి పెట్రోల్ బంక్‌లు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని బంకుల్లో నిర్వాహకులు పవర్ పెట్రోల్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపించారు. మరికొంత మంది బంకుల నిర్వాహకులు ఆన్లైన్లో డబ్బులు తీసుకోవడం లేదని, నగదు ఇవ్వాలని, అప్పుడే పెట్రోల్ పోస్తామని తెలుపుతున్నారని వాహనదారులు చెప్పారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక పెట్రోల్ బంకుల నిర్వాహకులు పెట్రోల్ లేదని చెబుతున్నారని, పవర్ పెట్రోల్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

ఇంట్లో పాలు కాచి తాగాలన్నా, ఏదైనా వంట చేసుకోవాలన్నా వంటగ్యాస్ తప్పనిసరిగా ఉండాల్సిందే. హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఏ వంటకం తయారు చేయాలన్నా గ్యాస్ కావాల్సిందే. ఊరూరా, గల్లీగల్లీ వాహనాల మీద వెళ్లి చిరువ్యాపారాలు సాగించేవారికి వారి వాహనంలో పెట్రోల్ పోస్తే తప్ప బండి ముందుకు కదలదు. గ్యాస్,పెట్రోల్, డీజిల్ మనిషి నిత్య జీవితంలో అవసరంగా మారాయి. ఇవి లేకపోతే బతుకు ‘బండి’ ముందుకు సాగని పరిస్థితి ఉంది.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో మనదేశానికి పెట్రోల్,డీజిల్,గ్యాస్ సరఫరాకు అడ్డంకులు ఎదురుకావడంతో అన్నిరంగాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ కొద్దిరోజులుగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు గ్యాస్ ఆఫీస్‌ల వద్ద బారులు తీరుతున్నారు. మంగళవారం నుంచి పెట్రోల్,డీజిల్ కొరత ఏర్పడడంతో సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని చాలాచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు.

పెట్రోల్,డీజిల్ దొరకదని సోషల్‌మీడియాలో,టీవీ చానెళ్లలో న్యూస్ వస్తుండడంతో వాహనదారులు బంకుల వద్దకు చేరి గంటల పాటు నిరీక్షించి పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతలేదని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నా యి. గ్యాస్, పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దందాలు సాగక చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 25
మెదక్ జిల్లాలో ఎక్కడా పెట్రో, డీజిల్ కొరత లేదు. కొరత పేరుతో వాహనదారులు అధికంగా పోయించుకుంటున్నారు. దీంతో ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో 87 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 16 మంది గ్యాస్ డీలర్లు ఉన్నారు.కంపెనీల నుంచి అవసరం మేర పెట్రోల్, డీజిల్ జిల్లాకు సరఫరా అవుతున్నది. జిల్లాలో అధిక ధరలకు అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-నిత్యానంద్, డీఎస్వో మెదక్