సంగారెడ్డి, ఏప్రిల్ 25: దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, తెలంగాణ పథకాలపై దేశ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ ప్లీనరీని చింతా ప్రభాకర్ అధ్యక్షతనలో ఏర్పాటు చేశారు. ఈ ప్లీనరీలో గ్రామస్థాయి కమిటీలు, మండలస్థాయి కమిటీలతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్లీనరీ సమావేశాన్ని చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ప్లీనరీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను ఆటపాటలతో కళాకారులు ఆలపించిన పాటలతో సభావేదిక ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్రస్థాయిలో జరిగే ప్లీనరీ సమావేశాలు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడంతో ప్లీనరీలో 11 తీర్మానాలను ప్రతినిధుల సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను చూసి దేశ ప్రజలు మాకు ఇలాంటి సమయం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారన్నారు. దేశంలోని ఎక్కడా లేనివిధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంతో ఆయా రాష్ట్ర ప్రజల్లో చర్చ మొదలయ్యిందని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియమాకాలపై పోరాడి సాధించిన రాష్ట్రంలో నీటిగోస ఉండకూడదనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి, అనతికాలంలోనే పూర్తి చేసిన ఘనతను సీఎం కేసీఆర్ సొంతం అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను దేశ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బీసీలకు ప్రాధాన్యం కల్పించిన సర్కార్ : పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు సముచిత స్థానంలో కల్పించి, ప్రత్యేకంగా నిధులు కేటాయించి అందజేస్తున్నారని, రాకీయంగా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గుర్తుచేశారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీల్లో గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు అందజేస్తున్నారన్నారు. గౌడన్నలకు చెట్ల పన్నులను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. రాబోవు రోజుల్లో జిల్లా కులాల ప్రతిపాదికన ఉమ్మడి జిల్లా రెండు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు కేటాయించాలని కోరారు. దేశవ్యాప్తంగా మోడల్ తెలంగాణ తయారు చేసేందుకు బీఆర్ఎస్కి సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు.
సామాజిక భద్రత తెలంగాణ లక్ష్యం : నరహరిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి దేశానికి ఆదర్శమని, ఇతర రాష్ర్టాల ప్రజలు ఇక్కడి పథకాలపై ఆసక్తిగా ఉన్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఉన్న ఊరిలో ఉపాధి లేక వలస వెళ్లిన వారు ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వలస వెళ్లిన వారు తిరిగి సొంతూర్లకు చేరుకుని సాగు చేసుకుంటునారన్నారు. ఈ ప్లీనరీలో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు జీవీ వీణా, జడ్పీటీసీలు సునీతా, పద్మావతి, కొండల్‌రెడ్డి, ఎంపీపీలు తొంట యాదమ్మ, సరళా, ఎంపీటీసీ సభ్యురాలు లలిత, నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, చక్రపాణి, మధుసూదన్‌రెడ్డి, మాకం విఠల్, గొల్ల ఆంజనేయులు, నర్సింలు, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యనారాయణ యాదవ్, గోవర్దన్‌రెడ్డి, శారద, చింతా గోపాల్, చింతా సాయినాథ్, ఎం.ఏ హకీం, రశీద్, మందుల వరలక్ష్మి, పిల్లోడి విశ్వనాథం, సుధీర్‌రెడ్డి, చిటుకుల మల్లేశం, చిల్వరి ప్రభాకర్, మల్లాగౌడ్, పాండురంగం, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.