హుస్నాబాద్‌టౌన్, నవంబర్ 10: కులగణన పేరుతో సర్వేకు వెళ్లిన అధికారుల ముంగిట ప్రజలు తమ సమస్యలు ఏకరువుపెడుతున్నారు. తాము సమస్యలు వినడానికి రాలేదని ప్రభుత్వం చెప్పిన విధంగా సమాచారాన్ని సేకరించేందుకు వచ్చామని అధికారులు వివరించినప్పటికీ సమస్యలు పరిష్కరించాలంటూ వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కులగణన పేరిట నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఆదివారం ప్రజలు తమ గోడును వెళ్లబోసుకోవడం కనిపించింది. పైగా కొత్తగా పథకాలు వస్తాయంటూ చెబుతూ సర్వేకు సహకరించాలంటూ కోరుతూ ఎన్యూమరేటర్లు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్ల్లుమంజూరు చేసిండ్రు…. ఇప్పుడు ఈ సర్కారు వచ్చిన తర్వాత ఆ ఇండ్లను రద్దుచేసిండ్రు. మాకొడుక్కు సర్కారు సాయం సెయ్యాలే. మా కొడుకు ప్రైవేట్‌గా పనిచేసి దూరంపోయి బతుకుతుండు. ఆ కొడుక్కు ఈ సర్కారు ఇండ్ల జాగ ఇచ్చి కాపాడలే. మా కొడుక్కు రేషన్ కారట్ కూడా లేదు. ఏమన్న చేసి ఆదుకుంటనే మా లాంటి పేదలు బాగుపడతరు…మా పరిస్థితి బాగోలేదు… కేసీఆర్ మళ్ల రాలేదు… ఆయన వత్తే ఏదో ఒకటి వత్తుండే కావచ్చు… ఇలా పట్టణంలోని బాలాజీనగర్ కులగణన సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌కు గాదర్ల భాస్కర్ సరస్వతి కుటుంబం తమ గోడును వెళ్లబోసుకున్నది. ఇదీ ఒక భాస్కర్, సరస్వతి కుటుంబమే కాదు.. అనేక కుటుంబాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సర్వే అధికారులకు వివరిస్తున్నారు. పథకాలు అందించి ఆదుకోవాలని గత సర్కారు చేసిన పనులను సైతం గుర్తుచేస్తూ కొత్తగా ఈ సర్కారు కూడా పథకాలు ఇవ్వాలని కోరుతున్నారు.