జిన్నారం, ఆగస్టు 23: ఇనాం భూముల్లో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏడాదిగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా గడ్డపోతారం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అండదండలతోనే అనుమతులు లేకున్నా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కన్వర్జేషన్ జోన్లో నిర్మాణాలు చేపట్టడంపై ప్రజలు ప్నశ్నిస్తున్నారు. సమీపంలోని ఓ కుంటనుంచి నిర్మాణాలకు ముప్పు పొంచి ఉంది.
ఇరిగేషన్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పండుతున్నది. కాంగ్రెస్ ముఖ్య నేత, గడ్డపోతారం మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి అండదండలు ఉండడంతో నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చేపడుతున్న నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో గల వావిలాల గ్రామంలోని 167, 166 ఇనాం, అసైన్డ్ తదితర భూముల్లో భారీగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ భూములు కన్వర్జేషన్ జోన్లో ఉన్నాయి. కన్వర్జేషన్ జోన్లో పరిశ్రమల ఏర్పాటు కోసం షెడ్లు ఏర్పాటు చేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెయ్యి, పదిహేను వందల గజాల స్థలంలో భారీగా షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఏడాది కాలంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఇటువైపు చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఐదు షెడ్ల నిర్మాణాలు పూర్తికాగా, మరో ఐదు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
పరిశ్రమలకు సమీపంలో పట్టెఖాన్ కుంట ఉంది. ఈ కుంట నిండి నీళ్లు వావిలాలలోని పీర్వా చెరువులోకి వెళ్తాయి. ప్రస్తుతం కుంట నుంచి బటయకు వచ్చే నీరు చెరువులోకి వెళ్లకుండా అడ్డంగా నిర్మాణాలు చేపట్టారు. ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తుండడం విస్మయానికి గురిచేస్తున్నది. వర్షాలు విస్తారంగా కురిసి కుంట నిండటంతో జిన్నారం- వావిలాల ప్రధాన రహదారిపై నుంచి నీరు ఈ పరిశ్రమల్లోకే వెళ్తాయి. దీంతో పరిశ్రమలకు కుంటనుంచి భారీ ముప్పు పొంచి ఉంది.
ఈ విషయమై ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మాణాలకు ఏమైనా అనుమతులు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే.. అన్నీ ఆ నేతనే చూసుకుంటారని నిర్మాణ నిర్వాహకులు సమాధానం ఇస్తుండడం గమనార్హం. అనుమతుల విషయంలో ఓ యజమానిని ప్రశ్నిస్తే ఈ సమాధానం వచ్చింది. జిన్నారం మండలం ముఖ్య కాంగ్రెస్ నేత కనుసన్నల్లో ఈ నిర్మాణాల కొనసాగింపు జరుగుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఈ నిర్మాణాలు చేపడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తక్షణమే అధికారులు ఈ నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గడ్డపోతారం మున్సిపల్ కార్యాలయ ఓ ముఖ్య అధికారి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారికి అండగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో నిర్మాణానికి మున్సిపల్ అధికారులు రూ.10లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.