ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడోరోజూ గురువారం ప్రజాపాలన గ్రామసభలు అట్టుడికాయి. అధికారులకు ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలు తప్పలేదు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెసోళ్లకు కేటాయించారని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుభరోసా, పింఛన్లు, పథకాలపై అధికారులను నిలదీశారు. పలుచోట్ల ప్రొటోకాల్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫొటో గ్రామసభల ఫ్లెక్సీలో పెట్టక పోవడంపై గజ్వేల్ మండలంలో ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, జనవరి 23
శేఖాపూర్ తండాలో పవర్ పాలిటిక్స్
జహీరాబాద్, జనవరి 23 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ తండాలో గురువారం అధికార పార్టీ నాయకుడి ఇంటి ఆవరణలో ప్రజాపాలన గ్రామసభను ఏర్పాటు చేయడంతో తండావాసులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకించారు. మండల అధికారులు సైతం గ్రామ పంచాయతీలో గ్రామ సభను నిర్వహిస్తామని చెప్పడంతో అధికార పార్టీ నాయకులు వీరంగం సృష్టించారు. తాము ఏర్పాటు చేసిన గ్రామసభ వేదిక వద్దకు అధికారులు రావాలని అధికార పార్టీ నాయకులు పట్టుబట్టారు. దీనికి తహసీల్దార్, గ్రామ ప్రజాపాలన ప్రత్యేకాధికారి రవీందర్ ససేమిరా అనడంతో అధికార పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామసభ వాయిదా వేయవద్దని అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారులు జహీరాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జహీరాబాద్ రూరల్ ఎస్సై ప్రసాద్‌రావు తన సిబ్బందితో తండాకు చేరుకున్నారు. పోలీసుల జోక్యం చేసుకుని నాయకులకు నచ్చజెప్పి తిరిగి తండాలో గ్రామసభను నిర్వహించారు. అనంతరం పలు పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు. కాగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు సభకు హాజరు కాలేదు.