పటాన్చెరు రూరల్, మార్చి 13: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినా స్పందన కరువైంది. దీంతో వినియోగదారులు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో గ్యాస్ వినియోగదారులు బుకింగ్ రాక కంగారుపడి హెచ్పీ గ్యాస్గోదాం వద్దకు చేరుకున్నారు.
మూడు రోజులుగా గ్యాస్సిలిండర్ కోసం అడుగుతుంటే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పంపడం లేదని మండిపడ్డారు. పలువురు తమ ఇండ్లల్లో గ్యాస్లేక పొయ్యి వెలిగించలేదని ఏజెన్సీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గ్యాస్ సిలిండర్లు రాలేదని, వస్తే ఇవ్వడానికి తాము సిద్ధమని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగ దారులకు సమాధానం చెప్పారు. సిలిండర్లు ఎప్పుడు సరఫరా అవుతాయో ఇప్పుడే చెప్పాలని పలువురు ఆందోళనకు దిగారు.
గ్యాస్ సిలిండర్లను బ్లాక్ చేశారని పలువురు ఆరోపించారు. ఆందోళనదారులు గట్టిగా వాగ్వాదం చేసినా తాము గ్యాస్ సరఫరా చేసే పరిస్థితి లేదని గోదాం సిబ్బంది తేల్చిచెప్పడంతో వినియోగదారులు విన్నకుండిపోయారు. గ్యాస్ సిలిండర్లు వస్తే తక్షణం బుకింగ్ చేసిన వారి ఇండ్లకు తప్పకుండా పంపిస్తామని ఏజెన్సీ సిబ్బంది నచ్చజెప్పడంతో అందరూ వెనుదిరిగారు.