జహీరాబాద్, సెప్టెంబర్ 30: రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని పరిశ్రమ ఎదుట నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగా రు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ) గ్రామ శివారులోని వైజయంతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్-యూనిట్-2 రసాయన పరిశ్రమ ఎదుట మంగళవారం సాయంత్రం జహీరాబాద్ మండలంలోని దిడ్గి, తుంకుంట, బూర్థిపాడ్, కొత్తూర్(బీ) గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మాట్లాడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లో భూగర్భ జాలలు కలుషితమవుతాయన్నారు. పంటలు పండవని, తాగు, సాగునీరు కూడా కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమ వేదజల్లే కాలుష్యంతో మూగజీవులు, ప్రజలు రోగాలబారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశ్రమ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సై కాశీనాథ్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ఆందోళన చేయవద్దని, తమకు ముందుగానే ఫిర్యాదు చేస్తే సమస్య గురించి సంబంధిత పరిశ్రమ అధికారులతో మాట్లాడే అవకాశం ఉండేదన్నారు. రసాయన పరిశ్రమ ఏర్పాటు గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని సీఐ ఆయా గ్రామాల ప్రజలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం పరిశ్రమ జీఎం లక్ష్మారెడ్డి అక్కడి వచ్చారు. తమ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని పోలీసు అధికారులకు ఆయన వివరించారు.