నర్సాపూర్, ఏప్రిల్ 18: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం, మంగళవారం జరిగే కూరగాయల సంతలో సరైన వసతులు లేక ఇటు వ్యాపారులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత నిర్వహించడానికి అనువైన స్థలం లేక రోడ్డుపైనే నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్ద ఇరువైపులా ఇరుకుగా ఉన్న రోడ్లపైనే సంత జరుపుతూ తైబజార్ వసూలు చేస్తున్నారు.
ఇరుకు రోడ్లపైనే సంత ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కూరగాయల వ్యాపారస్తులకు సరైన స్థలం లేకపోవడం వల్ల దుకాణాల ఎదుటనే వ్యాపారం కొనసాగిస్తున్నారు.
నర్సాపూర్ పట్టణంలో ప్రతి శుక్ర, మంగళవారాల్లో జరిగే సంత ద్వారా మున్సిపాలిటీకి లక్షల ఆదాయం వస్తున్నా మున్సిపల్ అధికారులు సౌకర్యాలు కల్పించడం లేదని వ్యాపారస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి వేసిన తైబజార్ వేలం పాటలో పట్టణానికి చెందిన కోలా సందీప్ రూ.33 లక్షల 12వేలకు దక్కించుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
వారానికి రెండు సార్లు జరిగే మార్కెట్ సంత కోసం బిడ్డర్లు పోటీపడి అత్యధిక ధరకు పాటపాడి కైవసం చేసుకొని చిరువ్యాపారస్తుల వద్ద నిర్ణీత ధర కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంతో అధికారులు, పాలకవర్గ సభ్యులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారస్తులు నీడ వసతి, తాగునీటి సౌకర్యం, ఉచిత మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.