విజయదశమి వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు. శమీ పూజలను నిర్వహించి జమ్మి ఆకులతో ఒకరికొకరు అలాయ్ బలాయ్ తీసుకొంటూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయమే సాధిస్తుందన్న విశ్వాసానికి ప్రతీకగా ప్రతి ఏడాది విజయదశమి వేడుకలను ప్రజలంతా కలిసిమెలసి జరుపుకోవడం, అన్ని గ్రామాల్లో కోలాహల వాతావరణం కన్పించింది. చిలిపిచెడ్ మండలంలోని గౌతాపూర్‌లో ప్రధాన కూడలి వద్ద సోమవారం నిర్వహించిన ‘జడకొప్పులాట’ ఆకట్టుకున్నది.

చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్లో బురుజుపై వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మరక్త గోల్కొండ కిషన్‌రావు దేశ్‌ముఖ్ జెండాను ఆవిష్కరించారు. రామాయంపేట పట్టణంలోని జాతీయ రహదారి వద్ద షామియానాలను ఏర్పాటు చేసి పాలపిట్ట దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో గ్రామస్తులు శమ్మిచెట్టుకు పూజలు చేసి ఉట్టి కొట్టారు. గిరిజనులు తమ తండాల్లో బోనాలతో ఊరేగింపు చేపట్టారు. కొల్చారంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
