మెదక్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మెదక్ జిల్లా జనరల్ దవాఖానకు రోజూ నాలుగు వందల మంది వరకు జ్వర బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో ఈ దుస్థితి నెలకొన్నది.
పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినా క్షేత్రస్థాయిలో ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. చెత్తాచెదారం కుళ్లి తద్వారా దోమలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా వైరల్ ఫివర్ బాధితులు ఉన్నారు. 24 డెంగీ, 84 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇక ప్రైవేటు దవాఖానలు, ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద మరో 5వేల మందికి పైగా వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం. వైద్యశాఖ ఫీవర్ సర్వే చేయించి, వచ్చిన సమాచారానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో వైద్యులను అప్రమత్తం చేయాల్సి ఉంది. కానీ అంతా మొకుబడిగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఫీవర్ సర్వే ద్వారా ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా వ్యాధుల బారిన పడ్డారా అన్న విషయాలు తెలుస్తాయి. ఆ ప్రకారం బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించవచ్చు. కానీ మెదక్ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఏడాదిన్నర కాలంగా పాలకవర్గాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెల్లో దోమలు స్వైరవిహారం చేస్తూ వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రత్యేకాధికారులు పల్లెల వైపు చూసిన పాపాన పోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేస్తున్నారు.
రోగులతో నిండిన జిల్లా దవాఖాన
మెదక్ జిల్లా కేంద్ర దవాకాన రోగులతో కిటకిటలాడుతున్నది. సీజనల్ వ్యాధులతో పాటు పలు రోగాలకు సంబంధించి పేషెంట్లు చికిత్స కోసం దవాఖానకు వస్తున్నారు. వందల సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య సిబ్బంది ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. గతంలో మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, బోదకాల వ్యాధుల బారినపడి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
మందులు అందుబాటులో ఉంచాం..
సీజనల్ వ్యాధులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 డెంగీ, 84 టైఫాయిడ్ కేసులు, మరో 20వేలకు పైగా వైరల్ ఫీవర్ బాధితులు ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధులను అరికడుతున్నాం. ప్రజలు భయపడకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్తే వైద్యం అందుతుంది. – డాక్టర్ శ్రీరాం, డీఎంహెచ్‌వో మెదక్
సీజనల్ వ్యాధుల పంజా
సిద్దిపేట, సెప్టెంబర్ 9: సిద్దిపేట జిల్లాకు జ్వరం పట్టుకుంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నా, వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఆశ వరర్లు ఇతర వైద్యారోగ్య శాఖ సిబ్బందితో కరపత్రాలు పంపి అవగాహన కల్పిస్తున్నామని చేతులు దులుపుకొంటున్నారు. తూతూ మంత్రంగా ఫీవర్ సర్వే చేసినా, క్షేత్రస్థాయిలో కార్యాచరణ లేదు. కలెక్టర్‌తో సహా పలువురు అధికారులు సమీక్ష చేసినా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నిద్రమత్తులోనే జోగుతున్నది. దీని ఫలితంగా గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ప్రతి ఇంట్లో టైఫాయిడ్, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బాధితులున్నారు. వీరికి ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందకపోవడంతో ఆర్ఎంపీలు, ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో 43,254 మంది జ్వర పీడితులు
జిల్లా వ్యాప్తంగా డెంగీ, మలేరియా సాధారణ వ్యాధులు పంజా విసురుతున్నాయి. జిల్లాలో 43 వేల 254 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. జిల్లాలో ఇటీవల రెండు డెంగీ మరణాలు సంభవించాయి. అవి అధికారులు లెకల్లో మాత్రం కనిపించకుండా పోయాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పిన లెకల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 56 మంది డెంగీ, 132 మంది టైఫాయిడ్, సాధారణ జ్వరంతో 36,358 మంది, 1510 మంది డయేరియా, జలుబు దగ్గు సంబంధిత వ్యాధులతో 5198 మంది బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
ఇంటింటా ఫీవర్ సర్వే చేస్తున్నాం..
ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వైద్య సిబ్బంది ఆశ వరర్లు ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారు. అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. రోజూ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సీజనల్ వ్యాధులపై ప్రచారం చేస్తున్నాం.
– డా.ధనరాజ్, డీఎంహెచ్‌వో, సిద్దిపేట