మెదక్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం పెద్దగా ఫలితాలు ఇవ్వడంలేదనే విమర్శలున్నాయి. అర్జీలు తీసుకోవడం తప్పా పెద్దగా పరిష్కారం చూపడం లేదనే, దీనిపై జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లో కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు.
ప్రజావాణిలో ప్రతివారం 50 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ఈ దరఖాస్తులు పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపిస్తున్నారు. కానీ, ఇక్కడే చాలా ఆలస్యమవుతున్నది. సోమవారం ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను నెలలు గడిచినా అధికారులు పరిష్కరించడం లేదు. భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ శాఖలో అర్జీలకు మోక్షం లభించడం లేదు. కలెక్టరేట్ నుంచి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తహసీల్ కార్యాలయాలకు పంపిస్తున్నారు. మెదక్ జిల్లాలో గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 64 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అందుల్లో భూభారతి అర్జీలు 21, ఇందిరమ్మ ఇండ్లు 11, పెన్షన్ 12, ఇతర 20 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అవి ఇప్పటి వరకు కదలని పరిస్థితి నెలకొన్నది.
భూ భారతి సమస్యల పరిష్కారంలో జాప్యం
ప్రతి ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కరించాలని ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదు వస్తున్నా.. వాటికి దిక్కూ దివానం లేదు. కలెక్టరేట్ నుంచి తహసీల్ కార్యాలయానికి చేరిన దరఖాస్తులను తహసీల్దార్లు నెలల తరబడి పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తహసీల్ కార్యాలయాల్లో డబ్బులివ్వకపోతే సమస్యలు పరిష్కరం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయానని, బ్రోకర్ వ్యవస్థ నడుస్తున్నదని ఆరోపణలు వస్తున్నా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో కినుకు వహిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు విచారణకు వచ్చినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐ) డబ్బులు ఇవ్వకపోతే దరఖాస్తులు క్లియర్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
అర్జీల పరిష్కారంపై పర్యవేక్షణ కరువు
ప్రతి సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం తప్పా, మళ్లీ ఎన్ని అర్జీలు పరిష్కారమయ్యాయో జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించక పోవడంతో ప్రజావాణి ఆశయం నీరుగారుతున్నది. తహసీల్ కార్యాలయాల్లో అమ్యామ్యాలు లేనిదే ఫైలు కదడంలేదని బహిరంగ విమర్శలున్నాయి. కొన్ని మండలాల్లో డబ్బులు తీసుకుని కూడా నెలల తరబడి సమస్య పరిష్కరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పింఛన్ల కోసం ఎంపీడీవో కార్యాలయానికి దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వం నుంచి అనుమతి లేదని వాటిని చూడడంలేదు. దీంతో పింఛన్ల కోసం పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా చక్కర్లు కొడుతున్నారు. కొందరైతే ఒకే సమస్యపై నాలుగైదు సార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసినా పరిష్కారం కావడం లేదు. మారుమూల గ్రామాల నుంచి మెదక్ కలెక్టరేట్‌కు వచ్చి, సమస్య పరిష్కారం కాక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు ప్రజావాణి అర్జీలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపాలని బాధితులు కోరుతున్నారు.