సిద్దిపేట రూరల్, మే 28: నకిలీ విత్తన విక్రేతలను వదిలేది లేదని, ఎంతటి వారున్నా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. మంగళవారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బందితో కమిషనరేట్లో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దుకాణాలు, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నకిలీ విత్తన తయారీలో ఎంతపెద్ద వారున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీం సభ్యులు రాబోయే 30 రోజులు వ్యవసాయశాఖ అధికారులను సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. గ్రామం, మండల స్థాయిలో నిఘా పెంచాలన్నారు. గత మూడేండ్లలో నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి గ్రామం నుంచి నకిలీ విత్తనాలపై సమాచారం అందేలా కమ్యూనికేషన్ పెంచుకోవాలని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించినట్లు తెలిస్తే డయల్ 100 లేదా 8712667100కు సమాచారం ఇవ్వాలని రైతులను, ప్రజలను కోరారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, టాస్క్ఫోర్స్ అధికారులు, స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.