సిద్దిపేట, ఆగస్టు 26: సిద్దిపేట జిల్లా కేంద్రంలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన రోగులతో (జనరల్ వార్డు) నిండిపోయింది. జిల్లా దవాఖానతో పాటు 33 పీహెచ్‌సీలు, రెండు అర్బన్ పీహెచ్‌సీలు, ప్రభుత్వ మెడికల్ కాలే జీ జనరల్ దవాఖానలు ఉన్నాయి.
నిత్యం వీటిలో ఓపీ 2800 నుంచి 3000 వరకు ఉంటుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో కూడిన జ్వరం వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా టైఫాయిడ్‌కు సంబంధించి 19 కేసులు, డెంగీకి సంబంధించి 56కేసులు, ఒక మలేరియా కేసుతోపాటు వైరల్ ఫీవర్‌తో చాలామంది రోగులు బాధపడుతున్నారు. అధికారులు చెప్పిన లెక్కలకు ప్రైవేట్ దవాఖానల్లో నమోదవుతున్న కేసులకు పొంతన లేకుండా పోతున్నది.
వందల సంఖ్యలో రోగులు డెంగీ, చికున్‌గున్యా బారినపడుతున్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో ఐదేండ్ల బాలుడు మృతిచెందడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో మరోసారి జ్వర సర్వే చేసేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నారు. దీనికితోడు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లిన రోగులను పరీక్షలు, చికిత్స పేరిట భారీగా డబ్బులు తీసుకుంటున్నారని రోగులు వాపోతున్నారు.