పటాన్చెరు, మే 19: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని, కార్యకర్తల కృషితో మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలువబోతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కృతజ్ఞత సభ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ స్థానం పోటీచేసిన వెంకట్రామిరెడ్డి విజయ కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్లలో ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనన్ని పనులు పటాన్చెరులో చేసినట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి ఓటు అడగాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. దొంగ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పటాన్చెరు నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన రూ.400 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలు తగదని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, తదితరులు ప్రసంగించారు. సమావేశంలో ఎంపీపీలు దేవానందం, ప్రవీణ విజయభాసర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయకుమార్, సోమిరెడ్డి, దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.